లవ్ జీహాద్ చట్టం : మతాంతర వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

లవ్ జీహాద్ చట్టం : మతాంతర వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు

UP Police stop inter-faith marriage బలవంతపు మతమార్పిడి(లవ్ జీహాద్)కి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​ కింద కేసులు పెరుగుతున్నాయి. తాజాగా లక్నోలో ఓ మతాంతర వివాహాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ముస్లిం యువకుడు హిందూ యువతిని చట్టవిరుద్ధంగా పెళ్లి చేసుకుంటున్నాడంటూ హిందూ యువ వాహిని సభ్యుల కంప్లెయింట్ మేరకు గత బుధవారం రాత్రి వివాహం జరుగుతోన్న ప్రదేశానికి చేరుకన్న యూపీ పోలీసులు పెళ్లిని అడ్డుకున్నారు.



ఇటీవల తీసుకొచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడిల నిరోధక ఆర్డినెన్స్​-2020లోని సెక్షన్​ 3, 8(క్లాజ్​ 2) ప్రకారం వివాహాన్ని అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ పెళ్లి ముందుగా హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించి.. తర్వాత ముస్లిం ఆచారాలతో చేపట్టేందుకు నిర్ణయించారని పోలీసులు తెలిపారు. అయితే ఈ సంఘటనపై ఎలాంటి ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదని తెలుస్తోంది.



అయితే, వధూవరుల కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఈ వివాహం జరుగుతుండటం గమనార్హం. దీంతో ‘లవ్​ జిహాద్​’ ఆర్డినెన్స్​ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వధువు బంధువులు కూడా ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశారు. ఇరువురి కుటుంబాల సమ్మతితో, వారి సమక్షంలో జరుగుతోన్న పెళ్లిని పోలీసులు అడ్డుకోవటం గతంలో ఎక్కడా చూడలేదన్నారు. స్వతంత్ర భారతంలో ఇలాంటి ఘటన ఒకటి ఎదురవుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, తల్లిదండ్రుల అనుమతితోనే వారి వివాహం జరుగుతన్నప్పటికీ కొత్తగా తీసుకొచ్చిన చట్టం ప్రకారం వారు వివాహానికి ముందు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.



మరోవైపు, యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్​లోకి మరో ఘటన చేరింది. చట్టపరంగా వివాహం చేసుకోవాలని అలీగఢ్​కు చెందిన ఓ ముస్లిం యువకుడు, మరోమతానికి చెందిన ఓ యువతిని తీసుకొని కోర్టుకు రాగా.. అక్కడే కొందరు దాడికి పాల్పడ్డారు. గురువారం జరిగిన ఈ సంఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. వైరల్ వీడియోలో.. యువకుడిని పలువురు పోలీసులు ఆటోరిక్షాలో తీసుకెళుతున్నట్లు కనిపిస్తోంది.


మరో వీడియోలో యువతిని మహిళా కానిస్టేబుల్​ తీసుకెళుతుండగా..తాను మేజర్​ అని అతడితోనే కలిసి జీవించాలనుకుంటున్నట్లు సదరు యువతి వారిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇద్దరిది వేరు వేరు మతాలే కాదు, వేరు వేరు రాష్ట్రాలు కూడా. వారిని అలీగఢ్​లోని సివిల్​ లైన్​ పోలీస్​ స్టేషన్​కు తరలించినప్పటికీ.. ఎఫ్​ఐఆర్​ నమోదు చేయలేదు.



కాగా,ఉత్తర్​ప్రదేశ్​ మౌ జిల్లాలో లవ్​ జిహాద్​ ఆర్డినెన్స్​ కింద 14 మందిపై కేసు నమోదైంది. జిల్లాలోని మొల్నాగంజ్​ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు చిరాయ్యకోట్​ పోలీస్​ స్టేషన్​లో షబాబ్​ ఖాన్​ అకా రాహుల్​, ఆయన సన్నిహితులు 13 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మతం మార్చాలనే ఉద్దేశంతో నవంబర్​ 30న వివాహ వేదిక నుంచి ఖాన్​​, ఆయన అనుచరులు తన కూతురిని అపహరించారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.