అమెరికాలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే లక్ష 80వేల కేసులు

  • Published By: sreehari ,Published On : November 14, 2020 / 10:07 PM IST
అమెరికాలో కరోనా విలయతాండవం.. ఒక్కరోజే లక్ష 80వేల కేసులు

US single day Covid-19 infections : ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. రోజువారీ కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి.

వైరస్ సెకండ్ వేవ్‌తో.. అమెరికాతో పాటు యూరప్ దేశాలన్నీ అతలాకుతలమవుతున్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీలో.. రోజురోజుకు వైరస్ విజృంభిస్తోంది.

అమెరికాలో త్వరలోనే ఏర్పడబోయే బైడెన్ ప్రభుత్వానికి.. ఈ వైరస్ పెద్ద సవాలే విసరబోతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసిన కరోనా.. ఇప్పుడా దేశంలో మరింత తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. రోజుకు లక్షన్నరకు పైగా కేసులు నమోదవుతున్నాయి.



8 రోజుల క్రితం రోజుకు లక్ష కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షన్నరకు చేరింది. ఒక్కరోజే అమెరికాలో 1 లక్ష 80వేల కేసులు నమోదయ్యాయి.

అదేరోజున కొత్తగా 1,431 మరణాలు నమోదయ్యాయి. అమెరికాలో కరోనా తొలి దశ వ్యాప్తి కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాగా, సెకండ్ వేవ్‌ మాత్రం అన్ని రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది.US single day Covid-19 infections46 రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందే తప్ప.. ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా ఉన్న ఏప్రిల్, మే కన్నా.. గడిచిన వారం రోజుల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువైంది.

కరోనా రోజువారీ మరణాల సంఖ్య వెయ్యి దాటింది. అమెరికాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 10,737,335 దాటేయగా.. మరణాల సంఖ్య 244,332కు చేరింది.



టెక్సాస్‌ తర్వాత 10 లక్షల కరోనా కేసులు దాటిన రెండో రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో.. ప్రజలు బయట తిరగడంపై మళ్లీ ఆంక్షలు విధిస్తున్నారు. ఇంటికే పరిమితమవ్వాలని చికాగో ప్రజలను అక్కడి అధికారులు ఆదేశించారు.

నెల పాటు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నెల 26న థాంక్స్‌ గివిండ్‌ డే సెలబ్రేషన్స్‌ కోసం.. ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు కోరారు.

న్యూయార్క్‌లో బార్లు, రెస్టారెంట్లపై ఆంక్షలు విధించారు. నైట్‌టైమ్‌ కర్ప్యూ విధించారు. శాన్‌ ఫ్రాన్సిస్కో కూడా రెస్టారెంట్లను మూసివేయాలని సూచించింది.



స్కూళ్లు తిరిగి తెరవాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య కోటి 10 లక్షల 64వేలు దాటింది. మరణాల సంఖ్య రెండున్నర లక్షలకు చేరువైంది.

కరోనా మృతులకు అమెరికాలోని లారెన్స్‌లో ఘన నివాళులర్పించారు. మృతులకు ఒక్కొక్కరికి ఒక్కో చైర్ కేటాయించి.. పుష్ఫగుచ్ఛాలుంచి శ్రద్ధాంజలి ఘటించారు అక్కడి అధికారులు.

కరోనా రెండో దశ వ్యాప్తి.. ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తోంది. రోజువారీ కరోనా మరణాల్లో ఎక్కువ మరణాలు అమెరికాలో నమోదవుతున్నాయి. తరువాతి స్థానంలో ఫ్రాన్స్ ఉంది. ఆ దేశంలో రోజుకు 5 వందల కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.



ఇటలీ, మెక్సికోల్లోనూ కరోనా మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆ రెండు దేశాల్లోనూ రోజువారీ మరణాల సంఖ్య 500కు పైగానే నమోదవుతోంది. బ్రిటన్, ఇరాన్‌లో రోజుకు 400 మందికి పైగా బాధితులు కరోనాకు బలైపోతున్నారు.

బ్రిటన్, ఫ్రాన్స్ సహా కొన్ని యూరప్ దేశాలు రెండో విడత లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ.. సెకండ్ వేవ్‌లో వైరస్ వ్యాప్తి నియంత్రణలోకి రావడం లేదు.



కరోనా తీవ్రస్థాయికి చేరిన ఏప్రిల్, మే నెలతో పోలిస్తే.. గత వారంలో రోజువారీ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరిగిపోయింది. ఫ్రాన్స్, బ్రిటన్, ఇటలీలో వైరస్ విజృంభిస్తోంది.

అన్ని దేశాల్లో కలిపి రోజూ 8వేల మందికి పైగా కరోనా కారణంగా చనిపోతున్నారంటే.. వైరస్ వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు.



ప్రపంచవ్యాప్తంగా మొత్తం మరణాల్లో.. సగానికి పైగా మరణాలు గడిచిన వారంలోనే నమోదయ్యాయి. అన్ని దేశాల్లో వైరస్ తగ్గినట్టే తగ్గి.. సెకండ్ వేవ్ రూపంలో విధ్వంసం సృష్టిస్తోంది.

అన్ని దేశాల్లో కలిపి మొత్తం కేసుల సంఖ్య 5 కోట్ల 37 లక్షలు దాటాయి. 13 లక్షల 9 వేలకు పైగా మరణాలు సంభవించాయి.