కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడుగుతున్నా.. భోరున ఏడ్చేసిన నటుడు..

  • Published By: sekhar ,Published On : December 13, 2020 / 07:47 PM IST
కాళ్లు పట్టుకుని క్షమాపణలు అడుగుతున్నా.. భోరున ఏడ్చేసిన నటుడు..

Vijay Rangaraju Apologises: సెలబ్రిటీలు మీడియా ముందు మాట్లాడేటప్పుడు.. ఒకటికి రెండు సార్లు ఆలోచించి.. ఆచి తూచి మాట్లాడాలి.. పొరపాటున మాట జారితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు రుచి చూశారు. అలాంటి సంఘటన తాజాగా సీనియర్ నటుడు విజయ్ రంగరాజుకి ఎదురైంది.

కన్నడ సూపర్‌స్టార్ దివంగత విష్ణువర్థన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. విష్ణువర్థన్ ఫ్యాన్స్, సినీ ప్రముఖులు క్షమాపణ చెప్పాల్సిందేనంటూ నిరసనలు వ్యక్తం చేయడంతో.. క్షమించండి బాబోయ్ అంటూ భోరున ఏడ్చేశారాయన.

అసలేం జరిగిందంటే..
విజయ్‌ రంగరాజు ఇటీవల ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ.. విష్ణువర్ధన్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ సన్నివేశం విషయంలో ఆయన కాలర్‌ పట్టుకున్నానని, చెడామడా తిట్టేశానని విజయ్‌ అన్నారు. రంగరాజు చేసిన వ్యాఖ్యలు కన్నడనాట దుమారం రేపాయి. ముఖ్యంగా భూమి మీద లేని నటుడి గురించి ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని కన్నడ ఫ్యాన్స్‌ విజయ్‌ రంగరాజుపై ఫైర్‌ అవుతున్నారు.

స్టార్‌ హీరోలు కిచ్చా సుదీప్‌, పవర్‌స్టార్ పునీత్‌ రాజ్‌కుమార్‌, రాకింగ్ స్టార్ యష్.. సీనియర్ నటి, దివంగత అంబరీష్ సతీమణి సుమలత వంటి వారందరూ సోషల్‌ మీడియా వేదికగా.. విజయ్‌ రంగరాజుపై ఫైర్‌ అవుతూ.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కన్నడ ఫిల్మ్‌ ఛాంబర్‌లో విజయ్‌ రంగరాజుపై ఫిర్యాదు కూడా నమోదైంది. టాలీవుడ్‌లోనూ అతనిపై చర్యలు తీసుకోవాలని సినీ పెద్దలను కోరుతున్నారు.

పెద్దమనసుతో నన్ను క్షమించండి..
దీంతో తాను ఎంత పెద్ద తప్పు చేశానో తెలుసుకున్న విజయ్‌ రంగరాజు.. క్షమాపణలు చెబుతూ ఓ వీడియో విడుదల చేశారు. ‘‘పొరపాటున అలాంటి వ్యాఖ్యలు చేశాను… కన్నడ అభిమానులు అలాగే స్టార్‌ హీరోలందరి కాళ్లూ పట్టుకుని క్షమాపణలు కోరుతున్నాను.. దయచేసి అందరూ నన్ను క్షమించండి. ఇకపై ఇలాంటి పొరపాటు చేయను.. పెద్దమనసుతో నన్ను క్షమించండి’’ అంటూ.. భోరున ఏడ్చేశారు. అలాగే ప్రస్తుతం తాను కరోనాతో బాధపడుతున్నట్లు తెలిపారు విజయ్ రంగరాజు.