అర్థరాత్రి వలస కూలీలకు స్వయంగా వండి పెట్టి ఆకలి తీర్చిన ఎస్పీ : అమ్మతనం అంటే అదే

  • Published By: nagamani ,Published On : May 18, 2020 / 06:09 AM IST
అర్థరాత్రి వలస కూలీలకు స్వయంగా వండి పెట్టి ఆకలి తీర్చిన ఎస్పీ : అమ్మతనం అంటే అదే

కరడు కట్టిన ఖాకీ దుస్తుల మాటన ఆడతనం పెల్లుబికింది. ఎంతటి ఉన్నతస్థాయిలో ఉన్నా..ఆడవారిలో ఎప్పుడూ అమ్మతనం పేగు కదులుతునే ఉంటుందని మరోసారి నిరూపించారు విజయనగరం ఎస్పీ రాజకుమారి. ‘ఆకలేస్తోందమ్మా..మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు..కడుపు కాలిపోతోంది అర్థరాత్రి సమయంలో  వలస కూలీలు అడగటంతో చలించిపోయారు. కదిలిపోయారు. కన్నీటి పర్యంతమమైన ఏపీలోని విజయనగరం ఎస్పీ రాజకుమారి తన సహజమైన అమ్మతనాన్ని చాటుకున్నారు. 

వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లాకు చెందిన 11 మంది వలస కూలీలు నెల్లూరు జిల్లాలో పనుల కోసం వెళ్లారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా వారు అక్కడే చిక్కుకుపోయారు. తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులతో కొన్ని రోజుల పాటు కడుపు నింపుకున్నారు. తరువాత చేతిలో పైసా కూడా లేకుండా పోయింది. దీంతో ఆకలితో అలమటించిపోయారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కాలినడకన సొంతూరికు బయలుదేరారు. కడుపు కాలుతున్నా.. ఎండ మాడుతున్నా… లెక్కచేయకుండా నడక సాగించారు.  ప్రాణాలతో తమ జిల్లాకు చేరుకుంటే పిడికెడు అన్నం దొరుకుతుందని ఆశపడ్డారు. అలా అలా కాళ్లీడ్చుకుంటూ విజయనగరం జిల్లా చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు. అక్కడ  ఆహారం ఉంటుందనుకున్న వారి ఆశ నిరాశే అయింది.

అలా చెక్ పోస్టు వద్దకు చేరుకున్న ఆ 11 మందిని పోలీసులు తీసుకెళ్లి క్వారంటైన్ లో పెట్టారు. ఓ వైపు ఆకలి పేగుల్ని మెలిపెట్టేస్తోంది. ఏం చేయాలో పాలుపోలేదు. ఓ మహిళ తనకు తెలిసిన ఓ మీడియా ప్రతినిధికి ఫోన్ చేయటంతో ఎస్పీ బి.రాజకుమారి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ కు ఫోన్ చేసిన ఓ వలస కార్మికురాలు అమ్మా ఆకలేస్తోంది. మూడు రోజుల నుంచి ఏమీ తినలేదు అంటూ అభ్యర్థించింది. 

అసలే లాక్ డౌన్ రోజులు నడుస్తున్న క్రమంలో  పొద్దున్నే లేచి విధులకు వెళ్లి ఏ అర్థరాత్రికో ఇంటికి చేరి కాస్తంత కునుకు తీసే సమయంలో అటువంటి ఫోన్ వస్తే ఎవరైనాసరే విసుక్కుంటారు. కానీ రాజకుమారి అలా విసుక్కోలేదు. ఈ సమయంలో ఫోన్ చేసింది ఎవరాని ఆలోచించారు. వెంటనే ఫోన్ తీయటంతో ‘అమ్మా ఆకలేస్తోందంటూ ఓ మహిళ దీనంగా అడిగేసరికి ఆమెకు నిద్ర మాయం అయిపోయింది. ఆకలేస్తోందమ్మా అని కన్నబిడ్డ అడిగితే తల్లి ఎలా స్పందిస్తుందో ఆమెకూడా అలాగే స్పందించారు. 

అలా ఫోన్ చేసిన మహిళ తాము 11 మంది ఉన్నామని అందరూ అదే దుస్థితిలో ఉన్నారని చెప్పింది. అంతే..ఆమెలో అమ్మతనం కదిలిపోయింది. వెంటనే పోలీసు అధికారులకు ఫోన్ చేసి  తినడానికి ఏమైనా దొరుకుతాయా? అని అడిగారు. ఈ అర్థరాత్రి  సమయంలో బ్రెడ్ మాత్రం తీసుకురాగలమని  చెప్పారు. మూడు రోజులుగా ఏమీ తినకుండా వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చిన వారికి, బ్రెడ్ పెట్టటానికి ఆమెకు మనస్సు ఒప్పలేదు. 

వెంటనే ఎస్పీ సూర్యకుమారి స్వయంగా అన్నం వండారు. ఇంట్లో ఉన్న నిమ్మకాయలతో లెమన్ రైస్ కలిపారు. వాటిని పొట్లాలు కట్టారు. ఆ పొట్లాలను తీసుకుని వచ్చి వలస కూలీలకు ఇచ్చారు. అప్పటికి రాత్రి ఒంటిగంట అయింది.

అర్ధరాత్రి ఫోన్ చేశారని విసుక్కోకుండా ఓ ఎస్పీ స్వయంగా వంట చేసి ఒంటి గంట సమయంలో స్వయంగా తీసుకొచ్చి తమకు అందించడంతో ఆ వలస కూలీలకు కన్నీళ్లు ఆగలేదు. చేతులెత్తి దండం పెట్టారు. మా ప్రాణాలు నిలబెట్టావమ్మా అంటూ కన్నీరు పెట్టుకున్నారు. గోడు అంతా చెప్పుకున్నారు. 

కానీ తొందరపడి ఎవరూ తొందరపడి ఇళ్లకు వెళ్లవద్దని ఆమె వారికి నచ్చజెప్పారు. ప్రభుత్వం వారికి క్వారంటైన్ స్టాంపులు వేసిన తర్వాతే ఇళ్లకు వెళ్లాలని సూచించారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను సమకూరుస్తానని..అధికారులు వెళ్లమని చెప్పేవరకూ ఇళ్లకు వెళ్లవద్దని సూచించారు ఎస్పీ రాజకుమారి.

Read Here>> వలస కూలీలకు సీఎం జగన్ ఆసరా : సొంతూళ్ల వరకు ఫ్రీగా ప్రయాణం..భోజనం..షెల్టర్