తెలంగాణలో విశాఖ ఉక్కు రాజకీయం.. నేతల మాటల తూటాలు

తెలంగాణలో విశాఖ ఉక్కు రాజకీయం.. నేతల మాటల తూటాలు

Bjp Trs

విశాఖ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం ఏపీలోనే కాదు.. తెలంగాణలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం సెగలు రేపుతోంది. ఉక్కు ఉద్యమానికి సపోర్ట్ చేసిన మంత్రి కేటీఆర్‌ను బీజేపీ నేతలు టార్గెట్‌ చేయగా.. టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. సొంత రాష్ట్రం చూసుకోవాలని కమలం నేతలు విమర్శిస్తుంటే.. నిప్పు మన ఇంటికి అంటుకుంటే గానీ పరిస్థితి అర్థం కాదంటూ కౌంటర్‌ ఇస్తున్నారు కేటీఆర్‌.

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి మద్దతు ఇచ్చేముందు.. తెలంగాణలో మూతపడిన పరిశ్రమల గురించి చెప్పాలని నిలదీశారు. కేటీఆర్‌ మొదట అజంజాహీ మిల్లు, నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని హితవు పలికారు బండి సంజయ్‌. కేటీఆర్ తన ఏడుపు తాను ఏడిస్తే బాగుంటుందని సెటైర్ వేశారు‌. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైజాగ్‌ స్టీల్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్‌ఎస్‌కి లేదన్నారు. నిజాం షుగర్స్‌ని తెరిపిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు.

బీజేపీ నేతల విమర్శలకు మంత్రి కేటీఆర్‌ కూడా ధీటుగానే కౌంటర్‌ ఇచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ను అమ్మిన బీజేపీ నేతలు.. రేపు సింగరేణి, ఈసీఐఎల్‌ను అమ్మరన్న గ్యారంటీ లేదన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ఎక్కడ విక్రయించినా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు కేటీఆర్‌. విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి నేతలు కలిశారు. విశాఖకు రావాలని ఆహ్వానించారు. ఉక్కు పోరాటానికి మద్దతు తెలిపినందుకు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు పోరాట సమితి నేతలు.

మరోవైపు విశాఖ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రపతి పేరిటి ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ భూములను కర్మాగారానికి బదలాయించాలని కోరారు. వాటిని అమ్మి ప్లాంట్‌ నిర్వహణ మూలధనం సమకూర్చుకోవచ్చని సూచనలు చేశారు జేడీ లక్ష్మీనారాయణ.