రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల ఆందోళన..వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల ఆందోళన..వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్

volunteers demand for salary hike: సచివాలయ వలంటీర్లు రోడ్డెక్కారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారు. జిల్లాల్లోని కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు దిగారు. గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ వలంటీర్లు విజయవాడలో ఆందోళనకు దిగారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గరికి వలంటీర్లు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దాంతో కార్పొరేషన్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. వేలాది మంది వలంటీర్లు రావడంతో పోలీసులు కూడా భారీగా మోహరించారు. తమకు రూ.10 వేల జీతం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వలంటీర్లు డిమాండ్ చేస్తున్నారు.

వలంటీర్ల ఆందోళనకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న గ్రామ, వార్డు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి కనీస వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ నాయకులు కోరారు. వలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

వలంటీర్ల డిమాండ్లు:
* ఏపీ వ్యాప్తంగా గ్రామ/వార్డు వాలంటీర్ల ఆందోళన
* జీతాన్ని రూ.5వేల నుంచి రూ.12వేలకు పెంచాలి
* ఉద్యోగ భద్రత కల్పించాలి
* ESI సౌకర్యం కల్పించాలి
* రోజుకు ఎన్ని గంటలు పని చేయాలో స్పష్టత ఇవ్వాలి
కొందరు అధికారులు తమకు గౌరవం ఇవ్వడం లేదు, రూ.5వేల జీతానికి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని వాలంటీర్ల ఆవేదన.