అన్‌లాక్ 2.0లోకి అడుగుపెడుతున్నాం.. వర్షాకాలం వస్తోంది.. జాగ్రత్తగా ఉండాలి : ప్రధాని మోడీ

  • Published By: sreehari ,Published On : June 30, 2020 / 04:30 PM IST
అన్‌లాక్ 2.0లోకి అడుగుపెడుతున్నాం.. వర్షాకాలం వస్తోంది.. జాగ్రత్తగా ఉండాలి : ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రేపటి (జూలై 1) బుధవారం నుంచి అన్ లాక్ 2.0లోకి అడుగుపెడుతున్నామని ఆయన అన్నారు. వర్షాకాలం కూడా మొదలైందని, జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఈ కాలంలో ఎక్కువగా వస్తాయని తెలిపారు. దేశ ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని మోడీ ఈ సందర్భంగా సూచించారు. కోవిడ్ పై భారత్ బాగా పోరాడుతోందని మోడీ స్పష్టం చేశారు. కరోనాను కట్టడి చేయడంలో ప్రతిఒక్కరూ సహకరించాలని, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.

ఇతర దేశాలతో పోలిస్తే మనం కరోనాతో పోరాటంలో చాలా మందంజలో ఉన్నామని చెప్పారు. సరైన సమయంలో లాక్ డౌన్ విధించడం వల్ల లక్షలాది మంది ప్రాణాలు కాపాడగలిగామని మోడీ స్పష్టం చేశారు. కరోనా విషయంలో వ్యక్తిగతంగా, సామాజికంగా ప్రజల్లో నిర్లక్ష్యం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. కొంతకాలం వరకు మాస్క్ లు, భౌతిక దూరం విషయంలో మనమంతా ఎంతో జాగ్రత్తగా ఉండేవాళ్లమన్నారు.

కంటైన్మెంట్ జోన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి :
కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. లాక్ డౌన్ చాలామంది ప్రాణాలను కాపాడిందని మోడీ అన్నారు. కంటైన్మెంట్ జోన్లలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్పంచ్ నుంచి ప్రధాని వరకు ఎవరూ నిబంధనలకు అతీతులు కారని తెలిపారు. లాక్ డౌన్ లో మనమంతా నిబంధనలను చక్కగా పాటించామని చెప్పారు. నిబంధనలు పాటించని వారి తీరు మార్చాల్సిన అవసరం ఉందని సూచించారు. మాస్క్ పెట్టుకోలేదని ఓ దేశ ప్రధానికే రూ.13వేల ఫైన్ వేశారని మోడీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 130 కోట్ల ప్రజల ప్రాణాలను కాపాడే మహత్కార్యం ఇదేనని అన్నారు. పేదల కోసం 1.75 లక్షల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని మోడీ అన్నారు దేశంలో 80 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్ తీసకున్నారని చెప్పారు.

ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన్ అమలు చేశాం :
లాక్ డౌన్ సమయంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదనే ప్రధాన లక్ష్యంతో పనిచేశామని అన్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాడం వల్లే ఎలాంటి విపతత్తునైనా అధిగమించే శక్తి వస్తుందని మోడీ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన అమలు చేసిందన్నారు. మరో ఐదు నెలలు ఉచితంగా 5 కేజీల బియ్యం, కిలో పప్పు అందిస్తామని హామీ ఇచ్చారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలకు ఉచిత బియ్యం, పప్పు అందనున్నాయని చెప్పారు.

జూలై నుంచి పండుగల సీజన్.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి :
20 కోట్ల మంది పేదలకు నగదు బదిలీ ద్వారా రూ.31వేల కోట్లు అందించామని అన్నారు. 9 కోట్ లమంది రైతుల అకౌంట్లో రూ.18వేల కోట్లు జమ చేసినట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం పీఎం గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్ ప్రారంభించామని మోడీ తెలిపారు. వలస కార్మికులకు ఉపాధి కోసం రూ.50వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. జూలై నుంచి పండగుల సీజన్ మొదలవుతుందని అన్నారు. ఇప్పట్నునుంచి ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలోని ప్రతీ రైతుకు, పన్ను చెల్లింపుదారునుకు పేదలందరి తరపున చేతులెత్తి నమస్కరిస్తున్నామని చెప్పారు. దీపావళి వరకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగించనున్నారు.

Read:ప్రపంచంలో స్ట్రీమింగ్ సర్వీసులకు ఇండియాలోనే తక్కువ చెల్లిస్తున్నారు!