రాగల 48 గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  వర్షాలు

  • Published By: murthy ,Published On : May 1, 2020 / 09:41 AM IST
రాగల 48 గంటల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో  వర్షాలు

దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రాగల 48  గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల  కోస్తాంధ్ర, రాయలసీమలో పలు చోట్ల పిడుగులతో కూడిన  తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 
 

కోస్తా తీరం వెంబడి గంటకు 30-40 కిలోమీటర్లు వేగంతో ఈదురు గాలులు వీచే ఆవకాశం ఉందని  అధికారులు చెప్పారు.  సముద్రం  అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. 
ఉరుములు, మెరుపులు తో కూడిన వర్షం కురిసేటప్పుడు రైతులు, రైతు కూలీలు, పశు గొర్రెల కాపరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని విపత్తుల శాఖ అధికారులు  సూచించారు.  (ఓ వైపు భానుడి భగభగ..మరోవైపు అకాల వర్షాలు)

మరో వైపు తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ లోని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.  ద్రోణి ప్రభావంతో వచ్చే 5 రోజులపాటు తెలంగాణ లో  తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

కాగా  శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బంజారాహిల్స్‌, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌, మలక్‌పేట, కొత్తపేట్‌, సైదాబాద్‌, చంపాపేట్‌, సంతోష్‌నగర్‌, మాదన్నపేట్‌, ఉప్పల్‌, పాతబస్తీ బహదూర్‌పురా, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.