దీదీ రె’ఢీ’ – ఎన్నికల్లో తనను ఓడించాలని బీజేపీని సవాల్ చేసిన మమత

బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం ద్వారా కమలనాథులకు సవాల్‌ విసిరారు.

దీదీ రె’ఢీ’ – ఎన్నికల్లో తనను ఓడించాలని బీజేపీని సవాల్ చేసిన మమత

West Bengal Elections : Didi accepts BJP’s challenge, to fight only from Nandigram : బీజేపీతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ. నందిగ్రామ్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించడం ద్వారా కమలనాథులకు సవాల్‌ విసిరారు. ఒకేసారి 291 స్థానాల లిస్ట్‌ను ప్రకటించి కమలనాథుల గుండెల్లో గుబులు పుట్టించారు దీదీ….బెంగాల్‌లో 8 విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 27న తొలి విడత ఎన్నికలు ప్రారంభం కానుండగా.. ఏప్రిల్‌ 29న ఎనిమిదో దశ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికలు సమీపిస్తుండడంతో తృణమూల్‌ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 294 స్థానాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ లిస్టులో 50 మంది మహిళలతో పాటు 42 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీ అభ్యర్థులు ఉన్నారు. వయసు మీరడం, తదితర కారణాలతో 23 మంది సిటింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్‌ కేటాయించ లేదు.

ఈ ఎన్నికల్లో బీజేపీతో అమీ తుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు మమతా బెనర్జీ. ఈసారి ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌ నుంచి కాకుండా… నందిగ్రామ్‌ నుంచే పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దమ్ముంటే ఈసారి ఎన్నికల్లో తనను ఓడించాలని బీజేపీని సవాల్ చేశారు. భవానీపూర్‌ నుంచి సోవన్‌దేవ్ ఛటోపాధ్యాయను బరిలోకి దింపారు. పదేళ్లుగా ఏంతో కష్టపడ్డానని, బెంగాల్‌ను దేశంలోనే టాప్‌స్థాయిలో నిలబెట్టడం తన ధ్యేయమన్నారు దీదీ.

ఇటీవల తృణమూల్‌ నుంచి బీజేపీలో చేరిన సువేందు అధికారి సొంత నియోజకవర్గం నందిగ్రామ్. ఈ నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉంది. మమతా నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తే… ప్రజలు 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తారంటూ సువేందు అధికారి సవాల్‌ విసిరారు. దీన్ని స్వీకరించిన మమతా… ఈ సారి తాను భవానీపూర్‌ నుంచి కాకుండా… నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తున్నట్లు శపథం చేశారు. తనను ఓడిస్తేనే బీజేపీ బలం ఏమిటో రుజువవుతుందని ప్రతి సవాల్‌ చేశారు. బీజేపీ మాత్రం భవానిపూర్‌లో ఓటమి తప్పదని తెలిసే మమత నందిగ్రామ్‌లో పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేసింది.

నందిగ్రామ్‌తో మమతా బెనర్జీకి మంచి అనుబంధం ఉంది. వామపక్షాలు అధికారంలో ఉండగా నందిగ్రామ్‌లో రైతులకు మద్దతుగా భూసేకరణకు వ్యతిరేకంగా పోరాడారు దీదీ. నందిగ్రామ్‌ పోరాటంతోనే మమత బెంగాల్‌లో అధికారంలోకి వచ్చారు. అందుకే ఆమె నందిగ్రామ్‌పై అంత నమ్మకంతో ఉన్నారు. మార్చి 10న అక్కడ నామినేషన్ వేయనున్నారు.