వారెవ్వా.. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు..

వారెవ్వా.. ఆరు బంతుల్లో ఆరు సిక్సులు..

వెస్టిండీస్ క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టి ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా అవతరించాడు. యువరాజ్ సింగ్ మరియు హెర్షెల్ గిబ్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ ఇలా చేయగా, వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో గిబ్స్ చేశాడు. శ్రీలంక జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉండగా.. రెండు జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టి 20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆంటిగ్వాలో జరుగుతోంది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లకు 131/9 స్కోర్‌ సాధించింది. పాతుమ్‌ నిస్సంక(39; 34 బంతుల్లో 4×4), డిక్‌విల్లా(33; 29 బంతుల్లో 3×4, 1×6) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు. తరువాత 132పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన విండీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి 13.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. పొలార్డ్‌(38; 11 బంతుల్లో 6×6) ఒకే ఓవర్‌లో సిక్సుల వర్షం కురిపించడంతో విండీస్‌ ఏడు ఓవర్లు మిగిలుండగానే విజయం సాధించింది.

అఖిల ధనుంజయ తన రెండో ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు తీయగా.. మూడో ఓవర్లో 36 పరుగులు సమర్పించుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి, ఒక ఓవర్ మొత్తం సిక్సర్లు కొట్టించుకున్న తొలి బౌలర్‌గా ధనంజయ్ నిలిచాడు. అతను తన రెండవ ఓవర్లో ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్ మరియు నికోలస్ పూరన్ వంటి పెద్ద వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక సులువుగా గెలిచే అవకాశం ఉండగా.. ధనంజయ ఓవర్‌లో మ్యాచ్ మొత్తం మారిపోయింది. పొలార్డ్ తన ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి వెస్టిండీస్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తీసుకువచ్చాడు. పొలార్డ్ 11 బంతుల్లో 38 పరుగులకు అవుటయ్యాడు.