జూ.డాక్టర్ల ఆందోళన..గాంధీ ఆసుపత్రిలో ఏం జరిగింది ? 

  • Published By: madhu ,Published On : June 10, 2020 / 12:34 AM IST
జూ.డాక్టర్ల ఆందోళన..గాంధీ ఆసుపత్రిలో ఏం జరిగింది ? 

గాంధీ ఆస్పత్రిలో ఉద్రిక్తత కొనసాగుతోంది. జూనియర్ డాక్టర్‌పై దాడికి నిరసనగా ధర్నాకు దిగిన గాంధీ వైద్యులు… ఆస్పత్రిలో ర్యాలీకి యత్నించారు. కానీ పోలీసులు వారిని అడ్డుకున్నారు. మరోవైపు ఆస్పత్రికి చేరుకున్న హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్… వైద్యులతో చర్చలు జరిపారు. ధర్నా విరమించి విధుల్లో చేరాలని కోరారు. దీనికి ససేమిరా అన్న వైద్యులు… తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ విషయంలో పోలీసులు, డాక్టర్ల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు ఈ న్యూస్‌ కవరేజీకి వెళ్లిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. కెమెరాలు లాక్కునేందుకు ప్రయత్నించారు.

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి..  జూనియర్‌ వైద్యుడిపై దాడికి దిగాడు. ఐసీయూలో బీభత్సం సృష్టించాడు. ఈ దాడిలో జూనియర్‌ డాక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గాంధీ ఆస్పత్రి సిబ్బంది ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్లు, నర్సులు డిమాండ్‌ చేశారు. వైద్యులకు రక్షణ కల్పించాలని కోరారు. 

ఇక అంతకుముందు గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతదేహం తారుమారవడం వివాదానికి దారితీసింది. బేగంపేట గురుమూర్తి నగర్‌ ప్రాంతానికి చెందిన కరోనా బాధితుడు… గాంధీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయాడు. అయితే అంత్యక్రియల కోసం బేగంపేటకు చెందిన వ్యక్తి మృతదేహానికి బదులు మరో వ్యక్తి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించారు. చివరి చూపు కోసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారంతా అక్కడికి వెళ్లారు. అయితే మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. అది తమకు సంబంధించిన వ్యక్తి మృతదేహం కాదని తెలిపారు. అంతటితో ఆగకుండా….. మృతుడి బంధువులు… గాంధీ ఆస్పత్రిపై దాడికి దిగారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు.

మృతుడి కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇరువర్గాలకు నచ్చజెప్పారు. ఆ మృతదేహాన్ని వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. బేగంపేటకు చెందిన వ్యక్తి మృతదేహం గాంధీ ఆస్పత్రిలోనే ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత అతడి మృతదేహానికి కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. 

గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతదేహం తారుమారు కావడంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతుంటే… తమపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ వైద్యులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Read: Gandhi Hospitalలో టెన్షన్ : విధుల్లో చేరమంటున్న జూనియర్ డాక్టర్లు