వాట్సాప్‌ యూజర్ల డేటా భద్రత కోసం అదిరిపోయే కొత్త ఫీచర్

వాట్సాప్‌ యూజర్ల డేటా భద్రత కోసం అదిరిపోయే కొత్త ఫీచర్

WhatsApp security feature: ప్రపంచ నెంబర్ వన్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. గడ్డు పరిస్థితిని ఎదుర్కోంటోంది. దీనికి కారణం ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీనే. ఈ ప్రైవసీ పాలసీ వివాదానికి దారితీసింది. దీనిపై పెద్ద రచ్చ జరిగింది. ప్రైవసీ పాలసీ యూజర్ల వ్యక్తిగత భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేస్తుందని పెద్దఎత్తున వాదనలు వినిపించాయి. తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే చాలామంది యూజర్లు వాట్సాప్ అన్ ఇన్‌స్టాల్ కూడా చేశారు. వాట్సాప్ నుంచి సిగ్నల్, టెలిగ్రామ్ యాప్స్‌కు మారుతున్నారు. ఈ పరిణామాలతో వాట్సాప్ దిగొచ్చింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఇప్పటికే నూతన ప్రైవసీ విధానాన్ని వాయిదా వేసిన వాట్సాప్.. యూజర్ల నమ్మకాన్ని నిలుపుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రైవసీ పాలసీలో ఎలాంటి మార్పులు చేయట్లేదని యూజర్లకు స్టేటస్‌ల రూపంలో ఇప్పటికే తేల్చి చెప్పిన వాట్సాప్ మరో అడుగు ముందుకేసింది. తాజాగా యూజర్ల డేటా భద్రత దృష్ట్యా కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకురాబోతుంది.

వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యాప్ లో లాగిన్ అవ్వడానికి ముందు వాట్సాప్ మరో సెక్యూరిటీని జోడించింది. సాధారణంగా డెస్క్‌టాప్‌లో మనం వాట్సాప్ లాగిన్ కావాలంటే నేరుగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోయేది. కానీ ఇకపై మాత్రం.. వాట్సాప్ యూజర్లు తమ ఖాతాలను కంప్యూటర్‌కు లింక్ చేసే ముందు ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ ఐడిని ఉపయోగించాల్సి ఉంటుంది.

అంటే.. వాట్సప్ యూజర్లు తమ ఖాతాలను కంప్యూటర్‌కు లింక్ చేసే ముందు.. వేలిముద్ర లేదా ఫేస్ ఐడిని ఉపయోగించి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ ఖాతాను ఇతరుల కంప్యూటర్‌కు లింక్ చేయకుండా అడ్డుపడుతుంది. ఇకపై వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ యాప్ కు వాట్సాప్ ఖాతా లింక్ చేయడానికి ముందు ఫోన్‌లో ఫేస్ ఐడి లేదా ఫింగర్ ప్రింట్ ద్వారా అన్‌లాక్ చేయమని కోరిన తర్వాత ఫోన్ నుంచి QR కోడ్ స్కానర్‌ను స్కాన్ చేసి యాక్సెస్ చేయచ్చు.

యూజర్ మొబైల్ ఫోన్‌లో ఉన్న డేటా రక్షణ కోసం ఈ ఫీచర్ తీసుకొచ్చినట్లు వాట్సాప్ తెలిపింది. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ ఇంకా అభివృద్ది దశలో ఉందని, త్వరలోనే అందరికీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నామని వాట్సాప్ ప్రతినిధులు వెల్లడించారు.