సూర్యాపేట ప్రమాదానికి బాధ్యులెవరు..? ఆరుగురి పరిస్థితి విషమం!

సూర్యాపేట ప్రమాదానికి బాధ్యులెవరు..? ఆరుగురి పరిస్థితి విషమం!

Suryapet

సూర్యాపేటలో గ్యాలరీ కూలిన ఘటనలో.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సూర్యాపేటలో నిర్వహిస్తున్న 47వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో ప్రమాదం జరిగింది. ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 150 మందికి పైగా గాయపడ్డారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకుపోవడంతో.. 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

కొందరి నిర్లక్ష్యం.. వందలాది మంది ప్రాణాలమీదకు తెచ్చింది. సూర్యాపేట ప్రమాద ఘటనకు ఓవర్‌లోడ్‌, నిర్మాణంలో అసలు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే కారణంగా తెలుస్తోంది. దీనిపై పోలీసులు కూడా ఓ క్లారిటీకి వచ్చారు. ఎంత నిర్లక్ష్యమంటే.. ఆటను చూసేందుకు చాలా మంది వస్తారని నిర్వాహకులకు తెలిసినా… అందుకు తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోకపోవడం. జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు భారీ ఏర్పాట్లు చేసినా.. నిర్వాహకులు కక్కుర్తి పనే ఇంతమందిని ఆస్పత్రి పాలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోటి రూపాయల వ్యయంతో స్టేడియాన్ని నిర్మించారు. ఇందుకోసం 90 టన్నుల ఇనుము, 60 టన్నుల కలప వినియోగించారు. 20 అడుగుల ఎత్తు, 240 అడుగుల వెడల్పు కలిగిన మూడు గ్యాలరీలను ఏర్పాటు చేశారు. 15 వేల మంది కూర్చుని ఆట వీక్షించేలా 30 మంది కూలీలు 25 రోజులపాటు శ్రమించి స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఎంత మంది కూలీలు, ఎంత శ్రమ పడ్డా.. ఒక్క చిన్న నిర్లక్ష్యం చాలు.. ఆ శ్రమను నాశనం చేయడంతో పాటు ప్రజలను ప్రమాదంలోకి నెట్టేందుకు. అదే సీన్‌ సూర్యాపేటలోనూ జరిగింది.

అంత శ్రమపడి కట్టిన కూలీలు వాటి నిర్మాణంలో అత్యంత దారుణంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే గ్యాలరీ నిర్మాణానికి మేకులు కొట్టడమో.. లేక బైండింగ్‌ వైరుతోనో నిర్మించాలి.. లేదంటే కనీసం గట్టి తాడులనైనా ఉపయోగించాలి. కానీ, నిర్మాణం చేపట్టిన వారు మాత్రం.. గుడ్డ ముక్కలను ఉపయోగించి కర్రలను కట్టేశారు. ఇదే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. అంతమంది జనం వచ్చే నిర్మాణంలో కనీస భద్రతా చర్యలు పాటించకుండా.. ఇలా చేయడం వల్లే ప్రమాదం జరిగింది. నిర్మాణం చేపట్టేందుకు కక్కుర్తి పడిన నిర్వాహకుల వల్లే.. ఇప్పడు అంతమంది ఆసుపత్రి పాలయ్యారు. బట్టలతో నిర్మించిన గ్యాలరీపై అంత ఎక్కువ మంది కూర్చోవడం కూడా ప్రమాదానికి మరో కారణమే.

సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఉన్న మైదానంలో 47వ జాతీయస్థాయి సబ్‌ జూనియర్‌ కబడ్డీ పోటీలకు భారీ ఏర్పాట్లు చేశారు. పోటీల కోసం ఇండోర్‌ స్టేడియం తరహాలో మార్చారు. మూడు వైపులా ప్రేక్షకులు, మరోవైపు వీఐపీలకు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. మూడు గ్యాలరీల్లో సుమారు 15వేల మంది కూర్చునేలా ఏర్పాటు చేశారు. అందులో వేదికకు ముందు భాగంలో 20 అడుగుల ఎత్తు, 240 ఫీట్ల పొడవుతో ఇనుప గ్యాలరీ ఏర్పాటు చేశారు. దీనిపై సుమారు 2వేల మంది కూర్చున్నారు. స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గ్యాలరీ కుప్పకూలింది.

మరి ఇంతమంది ఆస్పత్రి పాలవడానికి కారకులెవరు.. భారీగా ప్రేక్షకులు వస్తారని తెలిసినా ఏర్పాట్లు చేసేది ఇలాగేనా.. అయినా కరోనా విజృంభిస్తున్న సమయంలో.. అంతమందికి పర్మిషన్‌ ఎలా ఇచ్చారు. టెంపరరీగా ఏర్పాటు చేసినా.. గ్యాలరీ సరిగా ఉందా లేదా అనే విషయాన్ని నిర్వాహకులు పట్టించుకోలేదా..? మాములుగా అయితే.. భూమిలో రెండు ఫీట్లలోతు గుంతలు తవ్వి పిల్లర్లు పాతి.. వాటిపై గ్యాలరీ నిర్మించాలి. కానీ ఇక్కడ ఇనుప పిల్లర్లకు బదులు కర్రలు వాడారు. అదికూడా లోతుగా గుంతలు తవ్వకుండానే నిలబెట్టారని తెలుస్తోంది. స్టేజీ కదలకుండా బిగించడంలోనూ నిర్లక్ష్యం జరిగినట్లు తేల్చారు పోలీసులు. సరైన నిర్మాణ పర్యవేక్షణ లేకపోవడంతోనే.. ప్రేక్షకుల బరువు తట్టుకోలేక గ్యాలరీ కూలినట్టు అంచనా వేస్తున్నారు.