Sanjay Raut: ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ‘కశ్మీర్ ఫైల్స్-2’ తీయాలి: శివసేన

Sanjay Raut
Sanjay Raut: ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాను గత చరిత్ర ఆధారంగా తీసిన వారు ఇప్పుడు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై కూడా ‘కశ్మీర్ ఫైల్స్-2’ సినిమాను ఎందుకు రూపొందించడం లేదని శివసేన ప్రశ్నించింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమాలో 1990లో కశ్మీర్ పండిట్లు ఎదుర్కొన్న కష్టాలను చూపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మళ్లీ కశ్మీర్ పండిట్ల వలసలు ప్రారంభమయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ కేంద్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు.
”కశ్మీర్ పండిట్లను హత్య చేశారు.. కశ్మీర్ లోయను వదిలి వెళ్లేటట్టు చేశారు. కశ్మీర్ ఫైల్స్ సినిమా చూడాలని ప్రచారం చేసినవాళ్లు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఎందుకు? ఇప్పుడు నెలకొన్న పరిస్థితులపై కశ్మీర్ ఫైల్స్-2 సినిమా తీయాలి. ఈ సీక్వెల్‌ను కూడా ప్రధాని మోదీ ప్రచారం చేస్తారా? చరిత్రను దాచి పెట్టొద్దని అన్నారు కదా? మరి ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులను కూడా అంగీకరించాల్సిన అవసరం లేదా?” అని సంజయ్ రౌత్ ట్విటర్లో ప్రశ్నించారు. కాగా, కశ్మీర్ పండిట్లు జమ్మూకశ్మీర్ వదిలి వెళ్లిపోవడం లేదని, వారిని సురక్షిత ప్రాంతాలకు మాత్రమే వెళ్తున్నారని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల వరుసగా కశ్మీర్ పండిట్లపై ఉగ్రవాదులు దాడులు జరపడం కలకలం రేపింది. దీంతో ఇప్పటికే కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు.