Wild Tigers Attack : స్నేహితుల ప్రాణాలు తీసిన అడవి పులులు..రాత్రంతా చెట్టుపై ప్రాణభయంతో

తెల్లవారు జాము సమయంలో పులులు చెట్టు వద్ద నుండి వెళ్ళిపోయాయి. అయినా వికాస్ మాత్రం చెట్టు దిగేందుకు ప్రయత్నం చేయలేదు.

Wild Tigers Attack : స్నేహితుల ప్రాణాలు తీసిన అడవి పులులు..రాత్రంతా చెట్టుపై ప్రాణభయంతో

Wild Tigers Attack

Wild Tigers Attack : కళ్ళముందు స్నేహితుల చావు కేకలు..వెన్నులో వణుకు….అయినా బ్రతుకుపై ఆశ…ఆయుకుడిని ప్రాణాలతో బయటపడేలా చేసింది…పులల దాడిలో ప్రాణ స్నేహితులను కోల్పోయి వాటి భారి నుండి తెలివిగా తప్పించుకున్న ఓ యువకుడి వార్త ఉత్తర ప్రదేశ్ లో సంచలనంగా మారింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తే…

ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిట్ పరిసర ప్రాంతానికి చెందిన సోను, కాందైలాల్,వికాస్ వీరు ముగ్గురు మంచి స్నేహితులు. ఎక్కడికి వెళ్ళినా, ఏపనిచేసినా ముగ్గురు కలిసే ఉంటారు. ఉన్నట్టుండి ఈ ముగ్గురు కలసి అడవి మార్గం గుండా వెళ్ళేందుకు ఓ బైక్ పై బయలు దేరారు. వారు ప్రయాణిస్తున్నది ఖర్నౌట్ నదీ పరివాహకంలోని దట్టమైన అడవి ప్రాంతం. అది పులలకు అవాసం కేంద్రం. ఆ ప్రాంతంవైపు వెళ్లేందుకు ఎవరు సాహసం చేయరు. బైక్ పై వెళుతున్న ఈ ముగ్గురిని మార్గం మధ్య అటవీశాఖ అధికారులు నిలువరించి అటువైపు వెళ్ళవద్దంటూ హెచ్చరించారు. అయినా వినకుండా వారు బైక్ పై అడవిలో ముందుకుసాగారు.

అలా కొంత దూరం ప్రయాణించారో లేదో వారికి ఎదురుగా రెండు పులులు కనిపించాయి. బైక్ పై వస్తున్న వీరిపై మెరుపు వేగంతో దాడిచేశాయి. దాడిలో సోను, కాందైలాల్ పులులకు దొరికిపోయారు. అయితే వికాస్ మాత్రం వాటి బారి నుండి తప్పించుకుని దగ్గరలోని ఓ చెట్టు పైకి ఎక్కాడు. చెట్టుపై నుండి పులులు ఏంచేస్తున్నాయో గమనించసాగాడు. తన కళ్ళముందే స్నేహితులను క్రూరంగా చంపి ఆకలి తీర్చుకుంటుండం చూసి భయంతో గుండెఆగినంత పనైంది వికాస్ కి.. ధైర్యం తెచ్చుకుని చెట్టుపైనే ఉన్నాడు.

కొద్ది సేపటి తరువాత పులులు అతనికోసం చెట్టు ఎక్కే ప్రయత్నం చేసినప్పటికీ అది వాటికి సాధ్యపడలేదు. చాలా సమయం పులులు చెట్టుక్రిందే గడిపాయి. చెట్టుపైనే వికాస్ రాత్రంతా జాగారం చేశాడు.. తెల్లవారు జాము సమయంలో పులులు చెట్టు వద్ద నుండి వెళ్ళిపోయాయి. అయినా వికాస్ మాత్రం చెట్టు దిగేందుకు ప్రయత్నం చేయలేదు. ఉదయం 6గంటల సమయంలో కొందరు వ్యక్తులు అటవీ ప్రాంతం గుండా ప్రయాణిస్తుండటాన్ని చూసి కేకలు వేసి వారిని పిలిచాడు. వెంటనే వారు అక్కడకు చేరుకుని వికాస్ ను చెట్టుపై నుండి క్రిందికి తీసుకువచ్చారు. జరిగిన విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తేవటంతో వారు అక్కడికి చేరుకున్నారు.

ఈఘటనతో వికాస్ షాక్ కు గురయ్యాడు. అటవీ అధికారుల మాట పెడచెవిన పెట్టినందుకే ఇలా జరిగిందని మధనపడ్డాడు. ఏమాత్రం వారి మాటను ఆలకించి ఉన్నా తన స్నేహితులు ప్రాణాలు కోల్పోయే వారు కాదని వికాస్ అంటున్నాడు.