Hyderabadలో మరో ఫ్లై ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జి ప్రారంభం

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 04:03 AM IST
Hyderabadలో మరో ఫ్లై ఓవర్, అండర్ పాస్ బ్రిడ్జి ప్రారంభం

వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌ ఎల్బీనగర్‌ కామినేని జంక్షన్‌లో నిర్మించిన ఫ్లై ఓవర్‌, అండర్‌పాస్‌ బ్రిడ్జిలను మంత్రి కేటీఆర్ 2020, మే 28వ తేదీ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తే ఉప్పల్‌ వైపు నుంచి శ్రీశైలం హైవే, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలకు.. అండర్‌పాస్‌తో శ్రీశైలం, శంషాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌, ఉప్పల్‌ వైపు వెళ్లే వాహనాలకు ఎంతో ఊరట లభిస్తుంది.

ఈ అండర్‌పాస్‌ కోసం రూ. 14 కోట్లు, ఫ్లైఓవర్‌ కోసం రూ. 43 కోట్లు వెచ్చించారు. పనులు చేపట్టిన రెండేళ్లలో వాటిని పూర్తిచేశారు. మొత్తంగా… వీటి నిర్మాణంతో ఎల్బీనగర్‌ రింగ్‌రోడ్డు చౌరస్తాలో సిగ్నల్‌ ఫ్రీ, ట్రాఫిక్‌ ఫ్రీ ప్రయాణంతో 90 శాతం ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించనుంది. ప్రారంభానికి సంబంధించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. 

కామినేని ఫ్లై ఓవర్‌ :-
పొడవు: 940 మీటర్లు
వెడల్పు: 12 మీటర్లు
వ్యయం: రూ. 43 కోట్లు

ఎల్‌బీనగర్‌ అండర్‌పాస్‌ :-
పొడవు: 519 మీటర్లు 
క్యారేజ్‌వే: 10.5 మీటర్లు
వ్యయం: రూ.14 కోట్లు

GHMCలో వివిధ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగరంలో ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా సమస్యలు ఉండేవి. ట్రాఫిక్ మళ్లించడం, రాత్రి వేళల్లో పనులు జరగడం వంటి కారణాలతో ఆలస్యమయ్యేది. మంత్రి కేటీఆర్ ఆదేశాలు, సూచనలతో గత కొన్ని నెలలుగా పనులు ఊపందుకుంటున్నాయి. గత మార్చిలో కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ అమల్లోకి రావడంతో…పనులు ఇంకా వేగవంతం అయ్యాయి. వాన నీటి ముంపు సమస్యల పరిష్కారం కోసం వివిధ ప్రాంతాల్లో నాలాలను ఆధునీకరించడం, రిటైనింగ్ వాల్స్ వంటి పనులు పూర్తి చేశారు. ఇటీవలే బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్, పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జీ తదితర పనులు కూడా త్వరలోనే పూర్తి కానున్నాయి. 

 

Read: చారిత్రక ఘట్టం : 29న కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభం..చండీయాగం, సుదర్శనయాగం