ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, సైదిరెడ్డి

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, సైదిరెడ్డి

will resign for mla post: గిరిజన భరోసా యాత్ర పేరుతో సూర్యాపేటలో బీజేపీ నేతలు విధ్వంసం సృష్టించారని టీఆర్ఎస్ నేత, హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి మండిపడ్డారు. తాను భూ ఆక్రమణలకు పాల్పడినట్టు బీజేపీ నాయకులు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిరూపించలేకపోతే ఎంపీ పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అరాచకం సృష్టించడమే బీజేపీ అజెండా అని మండిపడ్డారు సైదిరెడ్డి.

తాను భూ ఆక్రమణలకు పాల్పడలేదని సైదిరెడ్డి తేల్చి చెప్పారు. తనపై బీజేపీ అసత్య ఆరోపణలు చేస్తోందని సైదిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, బండి సంజయ్ కలిసి నాటకాలు ఆడుతున్నారని సైదిరెడ్డి ఆరోపించారు. మీకు ధైర్యముంటే హుజూర్ నగర్ కానీ గుర్రంపోడు కానీ రండి… పబ్లిక్ గా మాట్లాడుకుందాం. ఏ ఒక్కటి నిరూపించినా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, లేదంటే మీరు ఎంపీ పదవికి రాజీనామా చేయాలి..అని బండి సంజయ్ కి సైదిరెడ్డి సవాల్ విసిరారు.

కాగా, బీజేపీ నేతలు గిరిజన భరోసా యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతలు గిరిజనుల భూములు లాక్కుని… ఇబ్బందులు పెడుతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడు తండాకు వెళ్లారు.

మఠంపల్లి మండలంలో తమ భూములు కబ్జా చేశారని స్థానిక గిరిజనులు కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్నారు. నాగార్జునసాగర్ నిర్వాసిత గిరిజనుల భూములను కబ్జా చేశారని అంటున్నారు. గుర్రంపోడు తండా.. సర్వే నెంబర్ 540లోని 18వందల 76 ఎకరాల భూములను సర్కారు అండతో.. స్థానిక టీఆర్ఎస్ నేతలు, వారి బినామీలు ఆక్రమించుకున్నారని విమర్శిస్తున్నారు. హుజూర్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సైదిరెడ్డి.. టీఆర్ఎస్ నేతలు భూ దందా చేస్తున్నారని.. గిరిజనుల హక్కులను కాలరాస్తున్నారని బీజేపీ అంటోంది.

గిరిజనుల భూముల్ని టీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే గిరిజనులపై దాడులు పెరిగాయని అన్నారు. పోలీసులతో తమను అడ్డుకోలేరని.. గిరిజనుల హక్కులను కాపాడుతామన్నారు.

కాగా, బీజేపీ నేతల గిరిజన యాత్ర గుర్రంపోడులో ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. నాగార్జున సాగర్ నిర్వాసితుల భూములను కబ్జా చేశారని గిరిజనులు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు గిరిజనులకు మద్దతు పలికారు. గిరిజనుల భూములను టీఆర్ఎస్ నేతలు కబ్జాలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో గిరిజనులు నిర్వాసిత భూముల్లోని సర్వే నెంబరు 540లో ఏర్పాటు చేసిన షెడ్లను కూల్చివేసేందుకు ప్రయత్నించారు. రవీందర్ రెడ్డి అనే వ్యక్తి అనుచరులు గిరిజనులను ఆ భూముల్లోకి రాకుండా అడ్డుకోవడంతో అక్కడ ఘర్షణలు జరిగాయి. పోలీసులు రంగప్రవేశం చేసి బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఈ క్రమంలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి. గుర్రంపోడులో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, మహిళా నేత విజయశాంతి పర్యటించారు.