రైతుల ఆందోళన.. దిగొచ్చిన కేంద్రం.. మేకుల తొలగింపు!

రైతుల ఆందోళన.. దిగొచ్చిన కేంద్రం.. మేకుల తొలగింపు!

Wire fences Farmers protest:ఓవైపు అంతర్జాతీయంగా వస్తున్న విమర్శలు.. మరోవైపు,… పోలీసుల తీరుపై పెరుగుతున్న నిరసనలతో ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. ఘాజీపూర్, టిక్రి, సింఘు సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన కంచెలు, ఇనుప మేకులను తొలగిస్తోంది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో ఆరవ తేదీన దేశవ్యాప్తంగా చక్కా జామ్ నిర్వహించాలని రైతుల సంఘాలు పిలుపునిచ్చాయి. ఎక్కడికక్కడ రోడ్లు దిగ్బంధించాలని నిర్ణయించాయి.

అయితే, రిపబ్లిక్ డే రోజు నిర్వహించిన ట్రాక్టర్ పరేడ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ సరిహద్దుల్లోకి రైతులు రాకుండా ఉండేందుకు బారికేడ్లు పెట్టారు. రోడ్లపై ఇనుప మేకులు దిగేశారు. దీంతో కేంద్రం తీరుపై విమర్శలు వెల్లువెత్తగా.. దేశ విదేశాల నుంచి రైతులకు మద్దతు పెరిగింది. అటు ప్రతిపక్షాలు కూడా ఈ చర్యలను ఎండగడుతూ.. కేంద్రాన్ని హెచ్చరించింది. రైతులు కూడా వెనక్కి తగ్గలేదు. ఇనుప చువ్వలున్నా కానీ.. అన్నదాతలు ఆగట్లేదు. దీంతో చేసేదేమి లేక కేంద్రం వాటిని తొలిగిస్తోంది.

కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో రైతులు చేస్తున్న సుదీర్ఘ ఉద్యమంలో ఈ పరిణామం ఆసక్తిగా మారింది. మరోవైపు రైతు ఉద్యమకారులను కలవడానికి ఘజియా పూర్‌లోని ఢిల్లీ సరిహద్దుకు చేరుకున్న పది రాజకీయ పార్టీలకు చెందిన 15 మంది ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పార్లమెంటు ఉభయసభల్లోనూ విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి పలు పార్టీలు.