కర్నూలులో 150ఏళ్ల నాటి పురాతన ఇంట్లో తవ్వకాలు, భయాందోళనలో స్థానికులు

కర్నూలులో 150ఏళ్ల నాటి పురాతన ఇంట్లో తవ్వకాలు, భయాందోళనలో స్థానికులు

witchcraft for hidden treasures in kurnool: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం కొండపేటలో క్షుద్రపూజల కలకలం రేగింది. 150ఏళ్ల నాటి పురాతమైన ఇంట్లో కొందరు వ్యక్తులు గుప్త నిధుల కోసం పూజలు చేసిన ఆనవాళ్లు వెలుగుచూశాయి. ఈ విషయం స్థానికులకు తెలియడంతో ఆ వ్యక్తులు అప్రమత్తమయ్యారు. ముగ్గులను చెరిపేశారు. ఇంటికి తాళం వేశారు. అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. దీనిపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. మెడికల్ షాప్ యజమాని రవితేజ కొన్నిరోజుల క్రితం ఆ ఇంటిని కొనుగోలు చేసినట్టు స్థానికులు తెలిపారు.

అటు రాయలసీమలోని మరో జిల్లాలోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. అనంతపురం జిల్లాలో క్షుద్రపూజల కలకలం రేగింది. బొమ్మనహల్ మండలం ఉంతకల్లు సమీపంలో యువకుడిని హత్య చేసి కాల్వలో పడేశారు. ఇవాళ(ఫిబ్రవరి 11,2021) అమావాస్య కావడంతో తెల్లవారుజామున కాల్వ గట్టుపై క్షుద్రపూజల చేసి యువకుడిని బలి ఇచ్చినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

పూజల అనంతరం యువకుడి తలపై బండరాయితో కొట్టిన ఆనవాళ్లు కనిపించాయి. అనంతరం మృతదేహాన్ని హెచ్‌ఎల్సీ కాల్వలో పడేసినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

క్షుద్రపూజలు, గుప్తనిధులు.. ఇవన్నీ మూఢనమ్మకాలే అని మేధావులు నెత్తీనోరు బాదుకుని చెబుతున్నారు. అదంతా ట్రాష్ అని, అలాంటివి నమ్మొద్దని కోరుతున్నారు. అయినా కొందరిలో ఇంకా మార్పు రాలేదు. గుప్తనిధుల ఆశతో దురాఘతాలకు పాల్పడుతున్నారు. కొందరు తోటి మనిషి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ సైన్స్ కాలంలోనూ కొందరు గుడ్డిగా మోసపోతున్నారు. మేధావులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఇంకా ఇలాంటి ఘటనలు వెలుగుచూడటం బాధాకరం.