స్వాతంత్ర్యం తరువాత ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ..మా అమ్మకు క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటున్న కొడుకు

స్వాతంత్ర్యం తరువాత ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ..మా అమ్మకు క్షమాభిక్ష పెట్టమని వేడుకుంటున్న కొడుకు

women will be hanged for first time in india son Request : కరడు కట్టిన నేరస్థులకు కూడా దేశ ప్రథమ పౌరుడు, రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతారనే విషయం తెలిసిందే. ఈక్రమంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ ‘షబ్నమ్’ 12 ఏళ్ల కుమారుడు రాష్ట్రపతికి తన తల్లి గురించి లేఖ రాశాడు. ఆ లేఖలో ‘మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమెకు క్షమాభిక్ష పెట్టండి రాష్ట్రపతి అంకుల్‌. ఆమెను ఉరి తీయొద్దు’.. అంటూ పేర్కొన్నాడు.

స్వాతంత్య్రం అనంతరం ఉరికంబం ఎక్కబోతున్న తొలి మహిళ షబ్నమ్‌ కుమారుడు మహమ్మద్‌ తేజ్‌ రాష్ట్రపతి కోవింద్‌కు చేసిన విజ్ఞప్తి ఇది. తమ పెండ్లికి నిరాకరించారన్న కోపంతో 2008లో ప్రియుడు సలీంతో కలిసి తల్లిదండ్రులను, ఇద్దరు సోదరులను, వారి భార్యలను, 10 నెలల వయసున్న మేనల్లుడిని షబ్నమ్‌ దారుణంగా హతమార్చింది.అప్పటికే గర్భవతి అయిన షబ్నమ్ ఆతరువాత మగబిడ్డను ప్రసవించింది. ఆ పిల్లాడే మహమ్మద్ తేజ్. కాగా షబ్నమ్ తనకు క్షమాభిక్ష పెట్టమని ఇప్పటికే రాష్ట్రపతికి లేఖ రాసింది. ఆ లేఖను రాష్ట్రపతి తిరస్కరించారు.

దారుణ హంతకురాలిగా మారిన ఉన్నత విద్యావంతురాలు షబ్నమ్ గురించి..
ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఆ మహిళ షబ్నమ్. పర్షియన్ భాషలో ఆ పేరుకు అర్థం ‘హిమ బిందువు’ అని. పేరుకు దగ్గట్టే సుకుమారంగా ఉండేది. అందంతో పాటు తెలివితేటలు షబ్నమ్ సొంతం. కానీ.. రోజులన్నీ ఒకలా ఉండవుగా..మనిషి జీవితాల్లో ఎన్నో మార్పులు వస్తుంటాయి. అలాంటిదే జరిగింది షబ్నమ్ విషయంలో. ఆ మార్పు ఘోరంగా ఉంది. ఒకేసారి ఏడుగురిని హత్య చేసిన కిరాతకురాలిగా మారింది. వాళ్లేమీ ఆమెకు శతృవులుకాదు. అందరూ ఆమె కుటుంబసభ్యులే. వారిలో అభంశుభం తెలియని ఓ చిన్నారి కూడా ఉండటం మరింత గుండెల్పి పిండేసే ఘటన.

షబ్నమ్ ఎందుకిలా మారింది? అసలేం జరిగింది?
షబ్నమ్ ఇంటి పక్కనే ఓ కట్టె కోత మెషీన్ ఉండేది. అందులో సలీమ్ అనే వ్యక్తి పనిచేసేవాడు. ఆమెకు అతడితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా శారీరక సంబంధానికి దారితీసింది. విషయం షబ్నమ్ ఇంట్లో తెలిసింది. దీంతో కుటుంబసభ్యులు మందలించారు. ఇకనైనా అతనితో సంబంధం తెంచుకోమని చెప్పారు. కానీ షబ్నమ్ వినలేదు.

పైగా సలీంను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అదే మాట ఇంట్లో వాళ్లకు చెప్పింది. కట్టె కోత కర్మాగారంలో కూలీగా పనిచేసేవాడికి బాగా చదువుకున్న తమ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్లు ఒప్పుకోలేదు. అదే మాట కూతురుతో కూడా చెప్పేసరికి షబ్నమ్ ఎదురుతిరిగింది. దీంతో గదిలో పెట్టి బంధించారు.

ప్రియుడిని కలవకుండా చేశారనే కోపంతో షబ్నమ్ తన కుటుంబసభ్యులపై కోపం పెంచుకుంది. ఈ క్రమంలో విచక్షణ మరచిపోయింది. దారుణమైన నిర్ణయం తీసుకుంది. కన్నవారని కూడా చూడకుండా వారిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. దీనికి ఓ ప్లాన్ కూడా వేసింది. తాను మారిపోయినట్లుగా ఇంటిలోవారిని నమ్మించింది. కానీ రహస్యంగా ప్రియుడిని కలిసి తన ప్లాన్ ఏంటో చెప్పింది.

అలా ఇద్దరూ కలిసి ప్లాన్ అమలు చేశారు. అలా 2008 ఏప్రిల్ 14 న కుటుంబసభ్యులు రాత్రి భోజనం తర్వాత తాగే పాలలో మత్తు మందు కలిపింది. వాళ్లు మత్తులోకి జారుకున్న తర్వాత తన ప్రియుడిని ఇంటికి రప్పించింది. సలీంతో కలిసి వారందరినీ గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి దారుణంగా హత్య చేయించింది. ఈ హత్యల్లో భాగంగా షబ్నమ్ మేనల్లుడైన చిన్నపిల్లవాడిని కూడా వదలకుండా అర్థరాత్రి ఇద్దరూ కలిసి అందరినీ అంతమొందించారు.

హత్య జరిగిన 5 రోజుల తర్వాత షబ్నమ్‌ను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరోగ్య పరీక్షలు చేయించగా షబ్నమ్ అప్పటికే ఏడు వారాల గర్భవతి అని తేలింది. పోలీసులు వారిద్దరిపై హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. 2008లో డిసెంబర్‌లో షబ్నం జైల్లోనే మగబిడ్డకు జన్మనిచ్చింది.

పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. కేసు విచారణ జరిపిన మథుర కోర్టు 2010 జూలై 14న నిందితులిద్దరికీ మరణశిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది. దీన్ని సవాలు చేస్తూ వారిద్దరూ అలహాబాద్‌ హైకోర్టును వెళ్లారు. అలహాబాద్ కోర్టు.. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థించింది. రివ్యూ పిటిషన్లను కొట్టివేసింది. దీంతో సలీం, షబ్నం‌ 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి నిరాశే ఎదురైంది. వారికి విధించిన శిక్షను అమలు చేయమని తేల్చి చెప్పింది.

చివరి ప్రయత్నంగా దోషులిద్దరూ రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష కోసం అభ్యర్థించారు. ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారికి క్షమాభిక్ష పెట్టడానికి నిరాకరించారు. దీంతో దారులన్నీ మూసుకుపోయాయి. ఇక ఉరితీయడమే మిగిలింది. దోషులిద్దరినీ ఉరి తేయడానికి మథుర కోర్టు త్వరలోనే తేదీలను ఖరారు చేయనుంది.

మహిళా ఖైదీలను ఉరితీయడానికి దేశంలో ఏకైక చోటు.. ‘మథుర జైలు’
భారత్‌లో మహిళలను ఉరి తీయడానికి ఏర్పాట్లు ఉన్న ఏకైక ప్రదేశం ‘మథుర జైలు’. దీన్ని 150 ఏళ్ల కిందట నిర్మించారు. బ్రిటిషర్ల పాలనా కాలంలో 1870లో ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతోంది. స్వాతంత్య్రానికి పూర్వం అక్కడ ఓ మహిళకు ఉరిశిక్షను కూడా అమలు చేసినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. 150 ఏళ్ల నాటి ఈ జైల్లో ఇప్పుడు మరో మహిళను ఉరికంభం ఎక్కించడానికి రంగం సిద్ధమైంది. స్వాతంత్య్రం తర్వాత ఉరిశిక్షకు గురైన తొలి మహిళగా షబ్నమ్ వార్తల్లోకి ఎక్కనుంది. ఈక్రమంలో షబ్నమ్ కు పుట్టిన కొడుకు తన తల్లికి క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశాడు.