WFH: ముగియనున్న వర్క్ ఫ్రం హోమ్.. ఆఫీసులకే వస్తామంటున్న ఐటీ ఉద్యోగులు!

కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాల్లో సమూల మార్పులు వస్తున్నాయి. రోజువారీ జీవన విధానంతో పాటు పని చేసే పద్ధతుల్లో మార్పు రాగా కొన్ని కంపెనీలు ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం కల్పించడానికి కూడా సిద్ధమయ్యాయి.

10TV Telugu News

WFH: కరోనా మహమ్మారి దెబ్బకు అన్ని రంగాల్లో సమూల మార్పులు వస్తున్నాయి. రోజువారీ జీవన విధానంతో పాటు పని చేసే పద్ధతుల్లో మార్పు రాగా కొన్ని కంపెనీలు ఉద్యోగులకు శాశ్వతంగా వర్క్ ఫ్రం హోం కల్పించడానికి కూడా సిద్ధమయ్యాయి. కరోనా వ్యాప్తితో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విధానం అమలు చేయగా కొన్ని సంస్థలు, రంగాలలో వర్క్ ఫ్రం హోంతో పనితీరు మెరుగుపడటం, ఉత్పాదన పెరగడం కంపెనీలకు లాభసాటిగా మారింది.

దీన్ని దృష్టిలో పెట్టుకునే శాశ్వత వర్క్ ఫ్రం హోం కాన్సెప్ట్ కు కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయాగా.. ఇప్పుడు చాలా సంస్థలలో ఈ ఇంటి నుండి పని విధానానికి ముగింపు పలికేందుకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఇన్ఫోసిస్ నుండి విప్రో వరకు దిగ్గజ ఐటీ సంస్థలు ముందున్నాయి. త్వరలోనే 2.6 లక్షల ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఇంటి నుండి పని విధానం ముగుస్తుండగా.. అందులో ఎక్కువశాతం మంది ఉద్యోగులు ఆఫీసుల నుండి పనికి మొగ్గుచూపారని ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

త్వరలోనే ఇన్ఫోసిస్ లిమిటెడ్ కార్యాలయాల నుండి పనిని తిరిగి ప్రారంభించవచ్చని తెలుస్తుంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకుంటే, ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పని చేయాలంటూ కోరుతామంటూ ఇప్పటికే విప్రో మానవ వనరుల విభాగం చీఫ్‌ సౌరభ్‌ గోవిల్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించగా.. ఇన్ఫోసిస్ కూడా ఉద్యోగులను కార్యాలయాలకు పిలిచేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.

దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీగా ఉన్న టీసీఎస్‌ కూడా వర్క్‌ఫ్రం హోంకి బై చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుండగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జరిగే తీరు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దాదాపుగా సెప్టెంబరు చివరి నాటికి ఉద్యోగులకు వాటి కుటుంబాలకు టీకాలు పూర్తిచేసుకోవాలని పలు కంపెనీలు ఇప్పటికే ఆదేశాలు ఇస్తుండగా మరికొన్ని టీకాల ప్రక్రియను మానిటరింగ్ చేస్తూ తదుపరి నిర్ణయాలను తీసుకొనేందుకు సిద్ధమవుతున్నాయి.