భారత్‌ – ఇంగ్లండ్ టెస్టు : మొతెరా కాదు మోదీ

భారత్‌ – ఇంగ్లండ్ టెస్టు : మొతెరా కాదు మోదీ

Motera

World’s Biggest Cricket Ground : సబర్మతి నది తీరాన భారత క్రికెట్‌ అభిమానులు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లారు. కొత్తగా పునర్నిర్మించిన సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్‌ మూడో టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ మైదానంగా వార్తల్లో నిలిచిన అహ్మదాబాద్‌ వేదికపై ఒక హోరాహోరీ పోరుకు రంగం సిద్ధమైంది. సిరీస్‌ సమంగా నిలిచిన ప్రస్తుత స్థితిలో ఈ మ్యాచ్‌లో గెలిస్తే భారత్‌ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరువవుతుంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2021, ఫిబ్రవరి 24వ తేదీ బుధవారం అధికారికంగా స్టేడియంను ప్రారంభించారు. హోంమంత్రి అమిత్‌షా, ఆయన కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జై షా, కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు పాల్గొన్నారు. అనారోగ్యం కారణంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు.

ఇప్పటివరకు అతిపెద్ద స్టేడియంగా ఉన్న మెల్‌బోర్న్‌ రికార్డును మొతెరా తుడిచేసింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియంగా, స్పోర్ట్స్‌ స్టేడియాల్లో రెండోదిగా కొత్త రికార్డు నెలకొల్పింది. 1983లో నిర్మించిన ఈ స్టేడియం అభివృద్ధికి 2015లో ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. సుమారు 800 కోట్ల రూపాయలతో 63 ఎకరాల్లో లక్షా పది వేల మంది సీటింగ్‌తో స్టేడియం నిర్మించారు. ఇందులో 75 కార్పొరేట్‌ బాక్సులు.. నాలుగు అధునాతన డ్రెస్సింగ్‌ రూమ్‌లను నిర్మించారు. మూడువేల కార్లు, 10 వేల బైకులు పట్టేలా పార్కింగ్‌ స్థలాన్ని ఏర్పాటు చేశారు.

ఇండియా, ఇంగ్లండ్‌ మధ్య జరుగుతన్న మూడో టెస్టుతో పాటు నాలుగో టెస్టుకు, ఐదు టీ ట్వంటీలకు కూడా మొతెరా వేదిక కానుంది. లక్షా పది వేల మంది సామర్థ్యం ఉన్నా కరోనా కారణంగా ఈసారి సగం మందికే అధికారులు అవకాశం కల్పిస్తున్నారు.