యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం..ఆధార్ తప్పనిసరి

  • Published By: madhu ,Published On : June 8, 2020 / 12:30 AM IST
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం..ఆధార్ తప్పనిసరి

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. క్యూలైన్లలో బాక్సులు ఏర్పాటు చేసి భౌతికదూరం పాటించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే క్యూలైన్లను శానిటైజ్‌ చేసిన ఆలయ అధికారులు… ప్రతి గంటకోసారి క్యూలైన్లలో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయనున్నారు. అయితే… సోమవారం స్థానిక భక్తులు, విశ్రాంత ఉద్యోగులు, ఆలయ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు మాత్రమే దర్శనాలు కల్పించనున్నారు. యాదగిరి గుట్టపై ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలనుంచే దర్శనాలు ప్రారంభమవుతాయి. రాత్రి 8 గంటల వరకు కొనసాగుతాయి. సోమవారం మాత్రం 8.30కి దర్శనం ప్రారంభంకానుంది.  

యాదాద్రి లక్ష్మీనరసింహుడి ఆలయంలో భక్తులు కోవిడ్‌ నియంత్రణ  చర్యలు తప్పనిసరిగా పాటించేలా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఆలయంలో తీర్థప్రసాదాలు, శఠారి పెట్టుటకు అనుమతి లేదని తెలిపారు. ఇక దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు తప్పనిసరిగా ఆధార్‌కార్డు తీసుకుని రావాలని అధికారులు కోరుతున్నారు. ఇక ప్రతి భక్తుడు మాస్క్‌ తప్పనిసరిగా ధరించి రావాల్సి ఉంటుంది. మాస్క్‌ లేని భక్తులకు అనుమతి నిరాకరిస్తారు. భక్తుల మధ్య భౌతికదూరం కూడా తప్పనిసరిగా పాటించాల్సిందే. 

ఇక ఆన్‌లైన్‌లో పూజ టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా వారి గోత్ర నామాలతో పూజలు నిర్వహిస్తారు. భక్తులు సమర్పించే తలనీలాల కల్యాణ కట్టను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే భక్తుల వసతి సౌకర్యం కోసం కేటాయించే గదులను కూడా నిలిపివేశారు. కొండపైకి భక్తుల ఫోర్‌ వీలర్‌కు అనుమతి లేదు. ఆర్టీసీ బస్సులతోపాటు….పరిమిత సంఖ్యలో ఆటోలు, ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. ఆటోలో ఇద్దరికే అవకాశం కల్పిస్తారు. 

ఇక గర్భిణిలకు, ఆరోగ్యంగా లేనివారు, పదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులకు దర్శనానికి అనుమతించరు. వారు ఇంటి దగ్గర ఉండటమే మంచిదని సూచిస్తున్నారు. యాదాద్రి ఆలయంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి ప్రతిరోజు విధులకు వచ్చే ముందు వారికి థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తారు. ఎలాంటి కరోనా లక్షణాలు లేవని నిర్ధారించుకున్న తర్వాతనే వారిని ఆలయంలోనికి అనుమతిస్తారు.