వైసీపీలోకి గంటా.. విజయసాయిరెడ్డి క్లారిటీ!

వైసీపీలోకి గంటా.. విజయసాయిరెడ్డి క్లారిటీ!

YCP MP Vijayasai Reddy:మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వెల్లడించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. గంటా అనుచరుడు కాశీ విశ్వనాథ్‌ వైకాపాలో చేరిన సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. జగన్‌ పాలన చూసి చాలా మంది వైసీపీలోకి రావాలని భావిస్తున్నారని, గంటా శ్రీనివాసరావు కూడా కొన్ని ప్రతిపాదనలు పంపారని, జగన్‌ ఆమోదం తర్వాత గంటా పార్టీలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు విజయసాయి రెడ్డి.

గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ కుమార్‌ తదితరులు ఇప్పటికే వైసీపీకి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు అనుచ‌రుడు, టీడీపీ నేత కాశీ విశ్వ‌నాథ్ విశాఖ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డితో పాటు ప‌లువురి స‌మ‌క్షంలో వైసీపీలో చేరారు.

కాశీ విశ్వనాథ్‌ను కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించగా.. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం హాజరుకాలేదు. కాగా, వైసీపీలో గంటా శ్రీనివాస‌రావు చేర‌తార‌ని కొన్ని నెల‌లుగా ప్ర‌చారం సాగుతూ ఉండగా.. గంటా చేరిక ప్రతిపాదనను మొదటి నుంచి మంత్రి అవంతి శ్రీనివాస్‌ వ్యతిరేకిస్తున్నారు.