YS Sharmila: రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోన్న ప్రభుత్వం

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని షర్మిల పరిశీలించారు.

YS Sharmila: రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోన్న ప్రభుత్వం

Ys Sharmila Fire On Kcr Government

YS Sharmila: తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని షర్మిల పరిశీలించారు. రైతులతో పాటు నేలపై కూర్చొని  రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న షర్మిల తేమ శాతం, తాళు అంటూ మూడు నుంచి ఐదు కిలోల వరకూ తరుగు తీస్తున్నారని రైతులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో గత రెండు నెలలు గా రెండే వార్తలు కనిపిస్తున్నాయని.. ఒకటి కోవిడ్, రెండు ధాన్యం కొనుగోలు.. ఈ రెండు విషయాలలో కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని షర్మిల ఆరోపించారు. ధాన్యం పండించిన రైతు.. కష్టాల ఊబిలో మునిగిపోతున్నాడని, వానలు పడి వడ్లు మొలకెత్తిన కొనడం లేదని, కేసీఆర్ చెప్పడం వల్లే రైతులు వరి పండించగా.. చివరి గింజ కొంటామని చివరికి ముఖం చాటేశారన్నారు. బట్టలు మార్చుకున్నంత సులభంగా అబద్ధాలు చెబుతున్న కేసీఆర్ కు జూన్ లో వానలు పడతాయని 80 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు.

చేతులారా పండించిన పంటను తగలబెడుతుంటే కేసీఆర్ తల ఎక్కడ పెట్టుకుంటారని.. కేసీఆర్ ముమ్మాటికి రైతు వ్యతిరేకి , రైతు ద్రోహేనన్నారు. 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పి 20 రోజులు గడుస్తున్నా అతిగతీ లేదని, రుణమాఫీ చేస్తానని కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదని, రైతుబంధు ద్వారా ఇచ్చే ఐదు వేలు దేనికి సరిపోదని.. రైతుబంధు రైతులకు చేస్తున్న అన్యాయానికి పరిహారమా అని ప్రశ్నించారు. రైతు పండించిన ఆఖరి గింజ వరకు కొనాలి.. మొలకెత్తిన ధాన్యం సైతం కొనాలి.. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుందని.. దీన్ని తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు.