YS Sharmila : వైఎస్ షర్మిల దీక్ష భగ్నం… పోలీసుల ఆంక్షలతో హైడ్రామా

బోడుప్పల్‌లో రవీందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. తెలంగాణ ప్రభుత్వం వందలమంది నిరుద్యోగులను హత్య చేసిందని తీవ్రంగా ఆరోపించారు.

10TV Telugu News

YS Sharmila : ప్రతి మంగళవారం చేసే నిరుద్యోగ నిరాహార దీక్షలో భాగంగా ఇవాళ బోడుప్పల్ పరిధిలోని పీర్జాదిగూడలో YSRTPఅధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన నిరసన దీక్ష గందరగోళానికి దారితీసింది. బోడుప్పల్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిరుద్యోగ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. పోలీసులు ముందు అనుమతి ఇచ్చి.. ఆ తర్వాత.. దీక్ష స్థలం మార్చుకోవాలని సూచించారని షర్మిల ఆరోపించారు. దీనికి నిరసనగా షర్మిల మేడిపల్లి పోలీస్ స్టేషన్ ను ముట్టడించాలని తన అనుచరులకు పిలుపునివ్వడంతో హైడ్రామా ఏర్పడింది.

హైడ్రామా మధ్య లోటస్ పాండ్ కు తరలింపు

బోడుప్పల్ వాసి… చనిపోయిన నిరుద్యోగి రవీందర్ నాయక్ కుటుంబాన్ని ఈ ఉదయం పీర్జాదిగూడలోని ఆయన ఇంట్లో పరామర్శించారు వైఎస్ షర్మిల. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ తర్వాత.. నిరాహార దీక్ష చేసేందుకు బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ కు వచ్చారు. ఐతే.. పోలీసులు స్థలం మార్చుకోవాలని షర్మిలకు సూచించారు. దీంతో… ఎగ్జిబిషన్ గ్రౌండ్ లోనే ఆందోళనకు దిగారు వైఎస్సార్ టీపీ కార్యకర్తలు. పోలీసుల ఆంక్షలు కాదని.. షర్మిల మేడిపల్లి పోలీస్ స్టేషన్ వైపు కదిలారు. బోడుప్పల్ కమాన్ దగ్గర షర్మిల వాహనాల శ్రేణిని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడినుంచి… మేడిపల్లి పీఎస్ వైపు.. కారులోనే షర్మిలను తరలించారు పోలీసులు. అనుచరులను ఆపిన పోలీసులు… షర్మిలను ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడినుంచి… నేరుగా… ఆమె నివాసం లోటస్ పాండ్ కు తీసుకొచ్చారు.

YS Sharmila: అక్టోబ‌ర్ 20 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర

పోరు ఆగదన్న షర్మిల

బోడుప్పల్‌లో రవీందర్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించిన షర్మిల.. తెలంగాణ ప్రభుత్వం వందలమంది నిరుద్యోగులను హత్య చేసిందని ఆరోపించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నిరుద్యోగి చనిపోతే రేవంత్ రెడ్డి కనీసం పరామర్శించరా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిని జనం నమ్మే పరిస్థితి లేదన్నారు. తల్లికి గంజి పోయేలేనోడు చిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తా అంటే ఎవరు నమ్ముతారని అన్నారు. కాంగ్రెస్… టీఆర్ఎస్ కి అమ్ముడుపోయిందని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించే స్థితిలో లేవన్నారు. ఎట్టిపరిస్థితుల్లో నిరుద్యోగంపై తన పోరు కొనసాగుతుందన్నారు షర్మిల. సీఎం పాకెట్ లో ఉన్న కొందరు నేతల్లాగా అందరూ ఉండరని చెప్పారు వైఎస్ షర్మిల. ప్రభుత్వం మెడలు వంచైనా నోటిఫికేషన్లు వేయిస్తామన్నారు.