కొత్త పార్టీ ఏర్పాటులో షర్మిల దూకుడు

కొత్త పార్టీ ఏర్పాటులో షర్మిల దూకుడు

కొత్త పార్టీ ఏర్పాటులో షర్మిల దూకుడు పెంచిందా..? వీలైనంత త్వరగా పార్టీ తీసుకొచ్చేందుకు షర్మిల రంగం సిద్ధం చేసుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కొంతకాలం మీటింగ్‌లు వాయిదా వేసుకున్నారంటూ వచ్చిన వార్తలకు ఫుల్‌స్టాప్ పెడ్తూ.. ఆమె కీలక సమావేశం నిర్వహించారు…! మరి ఈ భేటీలో తీసుకున్ని నిర్ణయాలేంటి..?

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు విషయంలో దూకుడు పెంచిన వైఎస్ షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చే లక్ష్యంతోనే అడుగులేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే రాజకీయంగా వడివడిగా అడుగులేస్తూ.. ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో సమావేశమైన షర్మిల.. లేటెస్ట్‌గా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల వైఎస్‌ఆర్ అభిమానులు, సానుభూతిపరులతో సమావేశమయ్యారు.

వైఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలుగా మెలిగిన నేతలు షర్మిల కొత్త రాజకీయ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారు. లోటస్‌పాండ్‌లోని నివాసంలో షర్మిలతో భేటీ అయ్యారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి. మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు చెప్పినప్పటికీ.. పూర్తిగా రాజకీయ అంశాలే భేటీలో చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్‌ అనుచరులుగా పేరొందిన నేతలకు షర్మిల తొలి ప్రాధాన్యం ఇస్తుండగా.. షర్మిల పార్టీలో రంగారెడ్డి ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్లేనని అంటున్నారు.

షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచనపై వస్తున్న విమర్శలను రంగారెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ బతికున్నప్పుడు కాళ్లు పట్టుకుని తిరిగిన నేతలు ఇప్పుడు వైఎస్‌ను విమర్శించడం సరికాదని.. షర్మిలపై అవాకులుచవాకులు మాట్లాడటం మంచిది కాదన్నారు.

ఇక.. షర్మిలతో ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారు రామచంద్రమూర్తి కూడా భేటీ అయ్యారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన రామచంద్రమూర్తి.. కొన్నాళ్ల తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. తగిన ప్రాధాన్యం దక్కకపోవడంతోనే రామచంద్రమూర్తి ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశానే ప్రచారం కూడా సాగింది.

అన్న వైఎస్ జగన్ పార్టీలో సలహాదారు పదవికి రాజీనామా చేసిన రామచంద్రమూర్తిని షర్మిల తన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సలహాలు కోరే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.