వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్, ఎమ్మెల్యే వార్నింగ్

వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్, ఎమ్మెల్యే వార్నింగ్

ysrcp mla controversial comments: ఏపీలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ వేడిని తార స్థాయికి పెంచాయి. తమ మద్దతుదారుల విజయం కోసం పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాయకులు.. కొన్ని సమయాల్లో నోరు జారుతున్నారు. కొందరు ప్రజా ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తున్నాయి.

కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే.. ఆ గ్రామంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామంటూ ఎమ్మెల్యే జోగి రమేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వేరే పార్టీ నుండి వార్డు మెంబర్‎గా పోటీ ‌చేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం(ఫిబ్రవరి 11,2021) జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. మన పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ తీవ్రంగా మండిపడ్డారు. సీఎం జగన్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు‌ చేస్తున్నారని ఆయన చెప్పారు. అయినా కూడా వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే.. పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం అని హెచ్చరించారు. జోగి రమేష్ అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి.

దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలను టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఖండించారు. జోగి రమేష్ పై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను డిమాండ్ చేశారు. బెదిరింపులకు గురి చేసి ఎన్నికల్లో గెలవాలని అనుకోవడం దారుణం అన్నారు. ఎమ్మెల్యే తీరుని ప్రజలు గమనిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని ప్రతిపక్ష నేతలు అన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీడీపీ, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని భావిస్తోంది.