కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి జింబాబ్వే అనుమతి

కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి జింబాబ్వే అనుమతి

Zimbabwe భారత్‌లో అందుబాటులోకి వచ్చిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ తమ దేశంలో అత్యవసర వినియోగానికి జింబాబ్వే ఆమోదం తెలిపింది. ఫలితంగా ఈ వ్యాక్సిన్​ను అనుమతించిన తొలి ఆఫ్రికా దేశంగా జింబాబ్వే నిలిచింది. సాధ్యమైనంత తొందరగా కొవాగ్జిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని జింబాబ్వేలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

కాగా, భారత్​ బయోటెక్​ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ 81శాతం సమర్థత కలిగినట్లు సంస్థ ప్రకటించిన మరుసటి రోజే జింబాబ్వే అనుమతించింది. దాదాపు 25,800 వాలంటీర్లలో నిర్వహించిన మూడో దశ ప్రయోగాల మధ్యంతర ఫలితాలను భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. భారత వైద్య పరిశోధనా మండలి(ICMR) భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ ప్రయోగాల్లో వ్యాక్సిన్‌ 81 శాతం ఎఫెక్టివ్ గా ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా,బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌ మీద కొవాగ్జిన్‌ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ అధ్యయనంలో తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది.

కాగా, భారత్‌లో వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం సహా.. ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ ఎగుమతి చేయడంలో భారత్‌ ముందుంది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఇప్పటికే పలు దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేస్తోంది. భారత్‌ బయోటెక్‌ కూడా 40దేశాల్లో అనుమతి కోసం దరఖాస్తులు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే బ్రెజిల్‌, యూఏఈ వంటి దేశాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ప్రకటించింది. ఇక.. అమెరికాలోనూ కొవాగ్జిన్‌ను పంపిణీ చేసేందుకు అక్కడి ఔషధ సంస్థ ఆక్యూజెన్‌తో భారత్‌ బయోటెక్‌ ఒప్పందం చేసుకుంది.