నాయకుడు నాయిని..జీవిత విశేషాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Leader Nayini Narsimha Reddy life history : టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి మృతి చెందారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2020, అక్టోబర్ 21వ తేదీ బుధవారం అర్థరాత్రి 12గంటల 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు.

టీఆర్ఎస్ సీనియర్ మోస్ట్ నేతగా.. కార్మిక నాయకుడిగా.. హైదరాబాద్ లీడర్‌‌గా.. సీనియర్ పొలిటీషియన్‌గా నాయిని నర్సింహారెడ్డి అందరికీ సుపరిచితమే. తెలంగాణ రాష్ట్ర తొలి హోంశాఖ మంత్రిగా పనిచేసి.. నాయిని చరిత్రకెక్కారు. 2014 నుంచి 2018 వరకు నాయిని నర్సింహారెడ్డి.. తెలంగాణ హోం మినిస్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జైళ్లు, ఫైర్ సర్వీసెస్, సైనిక్ వెల్ఫేర్, లేబర్ అండ్ ఎంప్లాయ్‌మెంట్ శాఖల బాధ్యతలు కూడా ఆయన చూసుకున్నారు.



హైదరాబాద్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుల్లో నాయిని నర్సింహారెడ్డి ఒకరు. కార్మిక సంఘం నాయకుడిగా.. కార్మికుల సంక్షేమం కోసం ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కలిసి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు నర్సింహారెడ్డి. అలా.. టీఆర్ఎస్‌లో నాయిని సీనియర్ నేతగా స్థిరపడిపోయారు. కేసీఆర్‌తో పాటు తెలంగాణం కోసం పోరాడిన నాయకుడిగా నాయినికి పేరుంది.

కారులో మంటలు..ఎన్సీపీ నేత సజీవదహనం


1944 మే 12న నాయిని దేవయ్య రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు నర్సింహారెడ్డి జన్మించారు. నర్సింహారెడ్డి ఒక రైతు బిడ్డ. హైదరాబాద్ లీడర్‌గా ఆయన అందరికీ తెలిసినప్పటికీ.. ఆయన సొంత గ్రామం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం నేరేడుగొమ్ము. 1970లలోనే.. నాయిని కుటుంబం హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది. నాయిని నర్సింహారెడ్డి.. ఆరోజుల్లోనే హయ్యర్ సెకండరీ వరకు విద్యనభ్యసించారు.



మొదటి నుంచే చురుకైన విద్యార్థిగా ఉంటూ వచ్చిన నాయిని ఆ ప్రాంతంలో జరిగే ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొంటుండేవారు. ఈ క్రమంలోనే 1958 జనవరి 26 వ తేదీన సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ప్రధానంగా ఆయన.. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో.. క్రియాశీలకంగా వ్యవహరించారు.

సోషలిస్టు పార్టీ జాయింట్‌ సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పదోన్నతి పొందుతూ వచ్చారు నాయిని. ఈ క్రమంలో ట్రేడ్‌ యూనియన్‌ లీడర్‌గా మారి కార్మిక సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. మొదట హమాలీ, తోపుడు బండ్ల కార్మికుల సమస్యలపై ఉద్యమించారు. నగరంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. కార్మిక నాయకుడిగా ముద్ర వేసుకున్నారు.



అనంతరం నాయిని నర్సింహారెడ్డి ప్రతిష్టాత్మకమైన వీఎస్‌టీ, ఐడీఎల్, హెచ్‌ఎంటీ, గంగప్ప కేబుల్స్, మోడ్రన్‌ బేకరి వంటి కంపెనీల్లో కార్మికనేతగా గెలుపొందారు. సికింద్రాబాద్‌ హాకర్స్‌ యూనియన్, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్లకు అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఈ క్రమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీలో నాయిని నర్సింహారెడ్డిని అరెస్టు చేసి ముషీరాబాద్‌ జైల్లో 18 నెలల పాటు నిర్బంధించారు. ఎమర్జెన్సీ మొత్తంకాలం నాయిని జైల్లోనే గడిపారు.

వీఎస్టీ ఇండస్ట్రీస్‌లో నాయిని నర్సింహారెడ్డి కార్మికసంఘం నాయకుడిగా పని చేశారు. ఇప్పటికీ.. ఆయన వీఎస్టీ లేబర్ యూనియన్‌కు సలహాదారుగా ఉన్నారు. 1970లలో.. నర్సింహారెడ్డి కుటుంబం హైదరాబాద్‌కు వలసొచ్చి స్థిరపడింది. అప్పటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి దిగారు. అంతకుముందే..1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో నాయిని క్రియాశీలపాత్ర పోషించారు.



ఆ తర్వాత.. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటిసారిగా 1978లో టి.అంజయ్యపై గెలిచారు. 1985, 2004లో ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2008 వరకు.. సాంకేతిక విద్య మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

సోషలిస్టు జీవితం.. సాదాసీదా మనస్తత్వం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే భోళాతనం.. నాయిని నర్సింహారెడ్డి సొంతం. సోషలిస్టుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అందరికీ అందుబాటులో ఉండే కార్మికనేతగా పేరుతెచ్చుకున్నారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేసిన నాయిని ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో జెయింట్‌ కిల్లర్‌గా అప్పట్లో సంచలనం సృష్టించారు.



ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒకవైపు ఇందిరా కాంగ్రెస్‌ నుంచి అప్పటి కార్మిక మంత్రి టి.అంజయ్య, మరోవైపు రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డిలతో ఆయన ఢీ కొన్నారు. ఆ ఇద్దరినీ ఓడించారు. 2,167 ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించి జెయింట్‌ కిల్లర్‌గా ఖ్యాతిపొందారు.

1978లో నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రమిజాబీ అనే ముస్లిం మహిళపై జరిగిన అత్యాచారం, దాడి ఘటన అప్పట్లో రాష్ట్రాన్ని మొత్తం కుదిపివేసింది. బాధితుల పక్షాన నిలబడి నాయిని సుదీర్ఘ పోరాటం చేశారు. అప్పట్లో నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ను వేలాది మందితో ముట్టడించారు. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నల్లకుంట, ముషీరాబాద్‌ ప్రాంతాలలో కర్ఫ్యూ కూడా విధించారు. ఈ ఘటనతోనే నాయిని వెలుగులోకి వచ్చారు.



కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రారంభించిన తర్వాత.. నాయిని నర్సింహారెడ్డి టీఆర్ఎస్‌లో చేరారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం.. కేసీఆర్‌తో కలిసి అడుగు వేసిన కీలక నేతల్లో నాయిని కూడా ఒకరు. తెలంగాణ ఉద్యమంలోనూ నాయిని తనదైన ముద్రవేశారు.

2004 ఎన్నికల్లో.. టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. టీఆర్ఎస్ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేశాక.. కేసీఆర్ కేబినెట్‌లో నాయిని నర్సింహారెడ్డికి చోటు దక్కింది. తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రిగా ఆయన పనిచేశారు.

Related Tags :

Related Posts :