ట్రంప్ వస్తున్నాడు.. పాన్ షాపులన్నీ బంద్.. గోడలన్నీ క్లీన్!

  • Published By: sreehari ,Published On : February 17, 2020 / 05:59 PM IST
ట్రంప్ వస్తున్నాడు.. పాన్ షాపులన్నీ బంద్.. గోడలన్నీ క్లీన్!

వచ్చేది ఎవరూ.. డొనాల్డ్ ట్రంప్… అందులోనూ అమెరికా అధ్యక్షుడు.. రాకరాక ఇండియాకు వస్తున్నాడు.. ఏర్పాట్లు ఎలా ఉండాలి మరి.. ఏమాత్రం తీసిపోకూడదు. ట్రంప్ అడుగుపెట్టే ప్రతిచోట రోడ్లన్నీ అద్దంలా మెరిసిపోవాల్సిందే. గోడలన్నీ శుభ్రంగా ఉండాల్సిందే.. అందుకే.. అహ్మదాబాద్‌లో ప్రత్యేకించి ట్రంప్ పర్యటించే ప్రాంతాల్లో మాత్రం క్లీన్ అండ్ గ్రీన్ చేసేస్తున్నారు. ట్రంప్ వచ్చే మార్గాల్లో గోడలపై పాన్ మరకలు కూడా కనిపించకుండా శుభ్రం చేస్తున్నారు. ట్రంప్ పర్యటన ముగిసే వరకు ఆయా ప్రాంతాల్లో ఎక్కడ కూడా పాన్ షాపులు తెరవొద్దని ఆదేశాలు జారీ అయ్యాయి.

ఒక్క పాన్ కూడా ఓపెన్ చేయొద్దని అన్నీ షట్ డౌన్ చేయాల్సిందే.. ఎందుకంటే.. మనుషులు చెప్పలేనివి ఎన్నో రోడ్లపక్కన ఉన్న గోడలు చెబుతాయి.. వాటిపై రాసిన రాతలు, గీతలు ఎన్నో పదాలకు అర్థాన్ని సూచిస్తాయి. పొరపాటున ఆ గోడలను ట్రంప్ ఇస్తే ఇంకేమైనా ఉందా? అందుకే పాన్ షాపులను మూసివేస్తున్నారు.

పాన్ షాపులు ఉన్న చోట.. పాన్ మసాలాలను తినే వారంతా రోడ్లపై.. పక్కనే ఉన్న గోడలపై నమిలిన పాన్ ఉమ్మేయడం చేస్తుంటారు. ఫిబ్రవరి 24న ట్రంప్ అహ్మదాబాద్ లో పర్యటిస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో పాన్ షాపులు ఉన్నచోట ఒకటికి రెండుసార్లు మున్సిపల్ అధికారులు చెక్ చేస్తున్నారు. నగరంలో ట్రంప్ ఉన్నంత సేపు ఇలాంటి చెత్త కనిపించకుండా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో అన్ని రోడ్లను గుంతలు లేకుండా మరమ్మత్తులు చేసి కొత్త రోడ్లలా తీర్చిదిద్దుతున్నారు. విమానా శ్రయానికి దగ్గరలోని సర్కిళ్లలో ఉన్న మూడు పాన్ షాపులను అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సీల్ వేసింది. ఒకవేళ ఎవరైనా పాన్ షాపు దుకాణాదారులు వేసిన సీల్ తొలగించేందుకు ప్రయత్నించే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఒక నోటీసు కూడా అంటించారు.

సాధారణంగా ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో ఉండే ఈ పాన్ షాపులు ఎంతో ఫేమస్ అని.. ఇటుగా వెళ్లేవారంతా కాసేపు ఆగి పాన్ మసాలా టెస్ట్ చేసి వెళ్తుంటారని ఓ పాదాచారుడు సలీం షేక్ తెలిపాడు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు ట్రంప్ తొలిసారి భారత్ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన 3 గంటల పాటు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు.