యువకుడి నోట్లోకి దూరిన 7 అంగుళాల చేప..నరకం చూపెట్టిందిగా..

యువకుడి నోట్లోకి దూరిన 7 అంగుళాల చేప..నరకం చూపెట్టిందిగా..

doctor removes 7inch fish in  mans throat : అమెరికాలోని కొలంబియాకు చెందిన ఓ యువకుడు నోట్లోకి ఓ చేప దూరిపోయింది. అలా గొంతులోకి దూరిపోయిన ఆ చేప కిందకు దిగదు..పైకి రాదు..దీంతో పాపం ఆ యువకుడు నరకం అనుభవించాడు. గబగబా హాస్పిటల్ కు పరుగెత్తుకెళ్లాడు. డాక్టర్లకు తన పరిస్థితి చెబుదామంటే మాటలు రావటంలేదు. సైగులు చేస్తున్న అతడిని చూసిన డాక్టర్లు అతను చెప్పేదేంటో అర్థం కాక ఒకరిమొహాలు మరొకరు చూసుకున్నారు. ఆ తరువాత సదరు యువకుడి గొంతు లావుగా ఉండటం చూసి ఏదో అడ్డంగా ఇరుక్కుపోయుంటదని గ్రహించి స్కానింగ్ చేయగా గొంతులోఉన్న చేప కనిపించింది.అది చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు..

జనవరి 23,2021న 23ఏళ్ల యువకుడు గాలం పట్టుకుని చెరువులో చేపల వేటకు వెళ్లాడు. అతడు విసిరిన గేలానికి ఓ 7 అంగుళాల చేప చిక్కింది. ఆ చేపను బయటకు తీసి చేపను వేరు చేసి చేత్తో పట్టుకున్నాడు. తరువాత మళ్లీ గేలాన్ని చెరువులోకి విసిరాడు. మరో చేప కూడా ఎరకు చిక్కింది. దీంతో రెండోసారి గాలానికి చిక్కుకున్న చేపను లాగటానికి గాలాన్ని చుట్టేందుకు ప్రయత్నించాడు. కానీ ఒక చేత్తో గేలాన్ని చుట్టడం సాధ్యం కాలేదు. అలాగని, రెండో చేపను వదులుకోవాలనుకోలేదు.

దీంతో చేతిలో ఉన్న చేపను నోటితో పట్టుకుని రెండు చేతులు ఉపయోగించి గేలాన్ని చుట్టాడు. ఈ క్రమంలో నోట్లో పెట్టుకున్న చేప ఇంకా బతికే ఉండటంతో అదికాస్తా గింజుకంది. అలా గింజుకున్న ఆ ఏడు అంగుళాల చేప అతడి గొంతులోకి జారి అక్కడ ఇరుక్కుపోయింది. చిన్న చేప అయితే కిందకు దిగిపోయేదేమో..కానీ అది ఏడు అంగుళాల సైజు ఉండటంతో పాపం అతను విలవిల్లాడిపోయాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడకు దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి పరుగులు తీశాడు.

ఏం జరిగిందీ చెప్పాలనుకున్నప్పటికీ చెప్పలేకపోయాడు. కానీ గొంతులో ఏదో ఉందని గ్రహించిన డాక్టర్లు స్కాన్ చేయగా, లోపల చేప చిక్కుకుపోయి కనిపించింది. దీంతో వెంటనే దానిని బయటకు తీసే ప్రయత్నం చేశారు. అన్న వాహికలో చిక్కుకుపోయిన ఆ చేపను చివరికి అతి కష్టం మీద బయటకు తీశారు. ఆ తర్వాత రెండు రోజులపాటు యువకుడిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు తెలిపారు. యువకుడి గొంతు నుంచి చేపను బయటకు తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.