Rain : వర్షంలో తడిచారా?….చర్మం, జుట్టు విషయంలో…

వర్షా కాలంలో వాతావరణం వల్ల చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వాన నీటిలో తడవడం వల్ల చర్మం దురదగా ఉంటుంది.

Rain : వర్షంలో తడిచారా?….చర్మం, జుట్టు విషయంలో…

Rain

Rain : వర్షకాలం వచ్చిదంటే చాలా మంది వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్ళి తడిచి ముద్దై పోతారు. అయితే మరికొందరికి వర్షంలో తడవటమంటే ఎంతో ఇష్టం.  వర్షం పడే సమయంలో సరదాగా తడుస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. వర్షంలో తడిచేవారికి జుట్టు, చర్మం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తడవటం వల్ల శరీరంపై చర్మం దెబ్బతింటుంది. రఫ్ గా మారటంతోపాటు పొడిబారిపోతుంది. జుట్టు సైతం చిక్కులు పడిపోవటం, గరుకుగా మారటం వంటివి చోటు చేసుకుంటాయి.

వర్షంలో తడిసిన తరువాత చర్మం, జుట్టు విషయంలో కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. వానలో తడిచిపోయిన తరువాత గోరు వెచ్చని నీటితో చక్కటి స్నానం చేయడం మంచిది. అలా చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరగుతుంది. చర్మంపై ఉన్న దుమ్ము, ధూళి, టాక్సిన్లు తొలగిపోతాయి. నీరు కాగబెట్టే సమయంలో గుప్పెడు వేపాకులు వేయటం ద్వారా వర్షం వల్ల శరీరంపై చేరే సూక్ష్మజీవులు తొలగిపోయేందుకు వేపనీటిలోని గుణాలు బాగా ఉపకరిస్తాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్లు దరిచేరవు.

వర్షా కాలంలో వాతావరణం వల్ల చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే వాన నీటిలో తడవడం వల్ల చర్మం దురదగా ఉంటుంది. దురద రాకుండా నివారించేందుకు వర్షంలో తడిచి వచ్చిన వారు స్నానం తరువాత చర్మాన్ని పొడిగుడ్డతో తుడుచుకుని మాయిశ్చరైజర్లను అప్లై చేయాలి. దీని వల్ల చర్మంపై తేమ పెరుగుతుంది. వానలో తడిసినప్పుడు జుట్టు చిక్కులు పడిపోయి బిగుతుగా మారుతుంది. అంతేకాకుండా బరకగా తయారవుతుంది. వర్షం సమయంలో వాతావరణంలో ఉండే తేమ ఇందుకు కారణం. ఇలాంటి వాటి నుండి జుట్టును కాపాడుకునేందుకు సిలికాన్ ఫ్రీ కండిషనర్ ఉపయోగించడం మేలు. ఇది మీ జుట్టును మెత్తగా పట్టులా మారుస్తుంది.

సిలికాన్ ఫ్రీ కండిషనర్ కొనుగోలు చేసి వాడలేని వారు ఇంట్లోనే గుడ్లు, పెరుగు కలిపి మీ జుట్టుకు అప్లై చేసి పదినిమిషాల అనంతరం గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. వర్షాకాలంలో తడిసిన జుట్టును సరిగ్గా ఆరబెట్టుకోకపోతే తలలోని బ్యాక్టీరియా, ఇతర ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తాయి. దీనివల్ల చుండ్రు, జుట్టు రాలిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతాయి. తలస్నానం చేసిన తర్వాత జుట్టును సహజంగా టవల్‌తో తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. కొబ్బరి నూనె, ఆముదం, బాదం నూనె ఇలా గోరు వెచ్చని నూనెతో తలకు మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కుదుళ్లకు తేమ అందుతుంది. జుట్టు బలంగా తయారవుతుంది.