Covid Vaccine: గుండెజబ్బులు ఉన్నవాళ్లకు కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదా..

కరోనాతో పోరాడే సమయంలో గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులపై ఒత్తిడి ఉంటుంది. ఆ సమస్యలు ఉన్నవారిలో అయితే కరోనాతో పోరాడటం కష్టమే. మరి వ్యాక్సిన్ తీసుకుని అలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చా..

Covid Vaccine: గుండెజబ్బులు ఉన్నవాళ్లకు కరోనా వ్యాక్సిన్ తీసుకోకూడదా..

Covid Vaccine

Covid Vaccine: కరోనాతో పోరాడే సమయంలో గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులపై ఒత్తిడి ఉంటుంది. ఆ సమస్యలు ఉన్నవారిలో అయితే కరోనాతో పోరాడటం కష్టమే. మరి వ్యాక్సిన్ తీసుకుని అలాంటి సమస్యల నుంచి బయటపడొచ్చా.. అవును తప్పక తీసుకోవాలని చెప్తున్నారు నిపుణులు. వ్యాక్సిన్ కు ముందు ఏం జాగ్రత్తలు కావాలి.

సాధారణంగా గుండె రుగ్మతలు ఉన్నవాళ్లు వాడే మందులు రక్తం పలుచబడేలా చేస్తాయి. ప్రత్యేక పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు మినహా మిగతావారు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. యాంటీ ప్లేట్‌లెట్స్‌ (ఆస్పిరిన్‌, క్లొపిడోగ్రెల్‌ మొదలైనవి) వీటిని తీసుకునేవారు వ్యాక్సిన్ తీసుకోకుండా ఆగాల్సిన పని లేదు.

Anticoagulant
ఈ మెడిసిన్ వాడేవాళ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. వ్యాక్సినేషన్‌కు ముందు పీటీ-ఐఎన్‌ఆర్‌ టెస్ట్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఐఎన్‌ఆర్‌ లెవెల్స్‌ మూడుకన్నా తక్కువగా వస్తే, మందులు మానేయకుండానే వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. ఎక్కువగా ఉంటే మాత్రం వైద్యుడి సూచన అనుసారం నిర్ణయం తీసుకోవాలి.

Newer Anticoagulants
వ్యాక్సిన్‌ తీసుకున్నా ఇటువంటి మందుల వాడకం ఆపాల్సిన పని లేదు. ఇటువంటి డ్రగ్స్‌ వాడేవారికి సహజంగానే రక్తం పలుచగా ఉంటుంది. వ్యాక్సిన్‌ తీసుకున్నప్పుడు సూది గుచ్చిన చోట మూడునుంచి ఐదు నిమిషాలు దూదితో అదిమి పెట్టుకుంటే సరిపోతుంది. రక్తం బయటకు రాకుండా నివారించడానికి ఇలా చేయాల్సి ఉంటుందంతే.

వైరస్‌ తీవ్రతనుబట్టి కొన్ని సమస్యలు ఏర్పడతాయి. హృదయ ధమనులలో చీలికలు ఏర్పడి గుండెపోటుకు దారి తీయొచ్చు. కరోనా లక్షణాలు ఉన్నప్పుడు ఛాతీలో అసౌకర్యంగా అనిపించినా, నొప్పి ఎక్కువగా ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

వ్యాక్సిన్‌తో సమస్య తలెత్తదు. రక్తం గడ్డకట్టే వీఐపీఐటీ రిస్క్‌ చాలా అరుదు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక గుండె జబ్బు బాధితుల్లో బ్లడ్‌క్లాట్‌ అయిన దాఖలాలు లేవు. ఎలాంటి అపోహలకూ తావు లేకుండా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు.

డయాబెటిస్‌, అధిక రక్తపోటు వ్యాధిగ్రస్థులు ఎలాంటి అనుమానాలూ లేకుండా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. తర్వాత కూడా డయాబెటిస్‌, బీపీ పేషెంట్లు మందులను ఆపాల్సిన అవసరం లేదు.

బైపాస్‌, స్టెంట్‌ సర్జరీ జరిగాక వ్యాక్సిన్‌ ఎప్పుడు తీసుకోవాలి?
సాధారణంగా అయితే, సర్జరీ జరిగిన వారం తర్వాత వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. చికిత్స అందించిన డాక్టర్‌ సూచన మేరకు ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి.

మిగిలిన వారితో పోలిస్తే
వైరస్‌ ఎవరికైనా సోకవచ్చు. గుండె జబ్బులు, ఇతర దీర్ఘకాలిక రుగ్మతలు ఉన్నవాళ్లకు వైరస్‌ సోకితే రిస్క్‌ ఎక్కువగా ఉంటుంది. వీరిలో లక్షణాలు త్వరగా తెలుస్తాయి. సాధారణ వ్యక్తులకన్నా ఇన్ఫెక్షన్‌ అధికంగా ఉంటుంది.