సంతానలేమి : Infertility అంటే ఏమిటి ?

  • Published By: madhu ,Published On : February 25, 2019 / 07:42 AM IST
సంతానలేమి : Infertility అంటే ఏమిటి ?

సాఫ్ట్ వేర్ జాబ్స్ వచ్చిన తరువాత సంపాదనైతే పెరిగింది గానీ స్ట్రెస్.. దాంతో పాటు వచ్చిపడుతున్న అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువైపోయాయి. ఎంత సంపాదిస్తే మాత్రం ఏం లాభం.. బిడ్డల్లేకపోయిన తరువాత.. అని బాధపడే పరిస్థితులు వస్తున్నాయి. కాని అప్పటికే ఆలస్యం అయిపోతోంది. చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు మాత్రమే కాదు.. కెరీర్ కోసం పరుగులు పెడుతున్న నేటి యువతరంలో ఎంతో మంది ఎదుర్కొంటున్న సమస్య సంతాన లేమి.

ఏ వయసుకా ముచ్చట అని పెద్దవాళ్లు ఊరికినే అనలేదు. సరైన వయసులో పిల్లల్ని కనకపోతే, ఇక ఆ తర్వాత కష్టమవుతుంది. చదువులూ, కెరీర్‌లంటూ పరుగులు తీసేసరికే కనీసం 30 ఏళ్లు దాటుతున్నాయి. అప్పుడు పెళ్లి చేసుకుని బిడ్డను కనాలంటే ఇక చాలామందిలో అనేక సమస్యలు ఉంటున్నాయి. అందుకే 20 ఏళ్ల క్రితం 7 శాతం మంది సంతానలేమితో బాధపడితే ఇప్పుడది డబుల్ అయింది. నేడు 15 నుంచి 20 శాతం మంది దంపతులు ఇన్ ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇన్ ఫర్టిలిటీ సమస్య ఉందని ఎప్పుడనుకోవాలి ? డాక్టర్ ని ఎప్పుడు కలవాలి ? అనే విషయాల్లో ఇంకా అనుమానాలున్నాయి.

ఇన్ ఫర్టిలిటీ ఉందని ఎప్పుడంటామంటే, పెళ్లయిన ఏడాది వరకు ఎటువంటి గర్భనిరోధక పద్ధతులు పాటించకున్నా ప్రెగ్నెన్సీ రాకుంటే ఇన్ ఫర్టిలిటీ అంటాం. అయితే 30 ఏళ్ల వయసులోపైతే వెయిట్ చేయొచ్చు. కానీ 35 ఏళ్లు దాటితే మాత్రం 6 నెలల వరకు ప్రెగ్నెన్సీ రాకపోతేనే డాక్టర్ ని కలవాలి. 38-40 ఏళ్ల పైబడినవాళ్లయితే ఒక  మూడు నెలల వరకు ట్రై చేసిన తర్వాతనే డాక్టర్ ని కలవాలి. ఇకపోతే సైకిల్స్ రెగ్యులర్‌గా లేకపోయినా, కలయికలో ఇబ్బందులున్నా ఏడాది వరకు ఆగాల్సిన అవసరం లేదు.

సంతానలేమి సమస్యకు దంపతులిద్దరూ సమానంగా కారణమవుతారు. స్త్రీలలో ఫర్టిలిటీ సమస్యలు 50 శాతం వరకు కారణమవుతాయి. ఇందుకు ప్రధాన కారణం వయసే. ఏజ్ ఎంత పెరుగుతుంటే పిల్లలు పుట్టే అవకాశం అంతగా తగ్గుతూ వస్తుంది. 30 ఏళ్లు దాటితే సమస్యలు ఎక్కువవుతాయి. ఇంకా ఆలస్యం అంటే 30 చివర్లలో అయితే ఇన్ ఫర్టిలిటీ సమస్య మరింత పెరుగుతుంది. 40 ఏళ్లు నిండితే పిల్లలు పుట్టే అవకాశం కేవలం 5 నుంచి 10 శాతం మాత్రమే ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అండాల నాణ్యత తగ్గుతుంది. అందుకే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. 

వయసుతో పాటు అండాల నాణ్యత తగ్గుతుంది. 35 ఏళ్ల వరకు పరవాలేదు గానీ ఆ తర్వాత నాణ్యత తగ్గుతుంది. ప్రెగ్నెన్సీ కష్టమవుతుంది. గర్భస్రావాలయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. పుట్టుకతో లోపాలు రావొచ్చు. అండం పెరగకపోవడం, అండోత్పత్తిలో సమస్య. ఇది హార్మోన్ల అసమతుల్యత వల్ల వస్తుంది. పిసిఒఎస్, థైరాయిడ్ సమస్యల వల్ల. అండం ప్రతి నెల పెరగదు, విడుదల కాదు. కొన్నిసార్లు స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన నిర్మాణ లోపాలు కూడా స్త్రీలలో ఇన్ ఫర్టిలిటీకి కారణమవుతాయి. వీర్యకణం అండంతో కలవడం అంటే ఫర్టిలైజేషన్ ప్రక్రియ ఫెలోపియన్ ట్యూబుల్లో జరుగుతుంది. కాబట్టి ఈ ట్యూబులు ఆరోగ్యంగా ఉండాలి. లేకుంటే ఫర్టిలైజేషన్ ప్రక్రియ జరుగక పిల్లలు పుట్టరు. ఇందుకు ఇన్ ఫెక్షన్లు, ఆపరేషన్లు ఇలా ఎన్నో కారణాలు. గర్భసంచి నిర్మాణంలో గానీ, ఇతరత్రా సమస్యలు గానీ ఉంటే కూడా సంతాన లేమి సమస్య తలెత్తుతుంది. 

ట్యూబల్ ఫ్యాక్టర్ మరో కారణం. ఫర్టిలైజేషన్ ట్యూబ్‌లో జరుగుతుంది. టిబి వచ్చినా, ఆపరేషన్ వల్ల ట్యూబ్‌లో బ్లాక్ ఏర్పడవచ్చు. వీళ్లకు గర్భం రాదు. రెండు ట్యూబులు బ్లాక్ అయితే అబ్ సొల్యూట్ ఇన్ ఫర్టిలిటీ అంటారు. గర్భసంచి నిర్మాణంలో సమస్యలు, డెవలప్ మెంట్ కి సంబంధించిన సమస్యలు, ఎండోమెట్రియాసిస్, ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ లాంటివి మెడికల్ కారణాలు. ఇవన్నీ వైద్య సంబంధమైన కారణాలు. కాగా ఎవరికి వాళ్ల స్వయంకృతాపరాధాలు కొన్ని. మారిన జీవనశైలి ఇందులో ఒకటి. శారీరక శ్రమ లేని ఉద్యోగాలు, సెడెంటరీ లైఫ్ స్టయిల్ వల్ల బరువు పెరిగిపోతున్నారు. దీనికి తోడు జంక్ ఫుడ్ కి అలవాటు పడిపోవడం. వెరసి.. లావయిపోతున్నారు. దాంతో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఇన్ ఫర్టిలిటీ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ఇటీవలి కాలంలో అమ్మాయిల్లో కూడా పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం లాంటి దురలవాట్లు పెరిగిపోతున్నాయి. దాంతో వాళ్లలో కూడా అనేక ఆరోగ్య సమస్యలు వచ్చిపడుతున్నాయి. స్మోకింగ్ వల్ల అండాల నాణ్యత తగ్గిపోతుంది. ఆల్కహాల్ వల్ల కూడా ఇన్ ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతాయి.