సాఫ్ట్ ల్యాండింగ్.. ఈసారి గురి తప్పదు : వచ్చే నవంబర్‌లో చంద్రయాన్-3

  • Published By: sreehari ,Published On : November 14, 2019 / 11:02 AM IST
సాఫ్ట్ ల్యాండింగ్.. ఈసారి గురి తప్పదు : వచ్చే నవంబర్‌లో చంద్రయాన్-3

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, ఇస్రో ప్రయోగత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం చివరి క్షణాల్లో ఫెయిల్ అయింది. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో విక్రమ్ ల్యాండర్ అదృశ్యమైంది. చంద్రునిపై రహాస్యాలను ప్రపంచానికి తెలియజెప్పాలని ఇస్రో చేసిన ప్రయత్నం కలగానే మిగిలిపోయింది. ఆఖరికి నాసా కూడా రంగంలోకి దిగిన ఫలితం లేకుండా పోయింది.

తొలి ప్రయత్నం విఫలమైనా ఇస్రో వెనక్కి తగ్గలేదు. మరోసారి చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఆఖరిలో నవంబర్ నెలలో ఇస్రో మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ ప్రయత్నానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమీప వర్గాలు వెల్లడించాయి. విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ ఆధారిత డైరెక్టర్ ఆఫ్ తిరువనంతపురం ఎస్. సోమనాథ్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ఇస్రో చేపట్టే అన్ని వెహికల్ ప్రొగ్రామ్ లాంచింగ్ లకు బాధ్యత వహించనుంది.

ఇందులో భాగంగానే చంద్రయాన్-3 ప్రయోగానికి కూడా రిపోర్టు సిద్ధం చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ప్యానెల్ రిపోర్టు కోసం ఇస్రో ఎదురుచూస్తోంది. వచ్చే ఏడాది ఆఖరులోగా మిషన్ ప్రిపేర్ చేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను కమిటీకి ఇచ్చేసినట్టు ఇస్రో సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నవంబర్ నెలలో కొత్త ప్రయోగం లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈసారి రోవర్, ల్యాండర్, ల్యాండింగ్ ఆపరేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో దృష్టిసారించనుంది.

చంద్రయాన్-2 ప్రయోగంలో లోపాలు పునరావృతం కాకుండా ఇస్రో చర్యలు చేపడుతుందోని బెంగళూరు కేంద్రీయ అంతరిక్ష సంస్థ వర్గాలు తెలిపాయి. చంద్రయాన్-2లో భాగంగా సెప్టెంబర్ 7న చంద్రుని దక్షిణ ధ్రువంలో ఇస్రో.. విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసేందుకు విఫలయత్నం చేసింది. ఇక్కడే ల్యాండర్ విక్రమ్‌తో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి విక్రమ్ ఆచూకీ కోసం ఇస్రో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.