కరోనా టీకా.. ఇక మీ ఇష్టంతోనే..!

కరోనా టీకా.. ఇక మీ ఇష్టంతోనే..!

Coronavirus Vaccine vaccinate with your Own Consent : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని అతి త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొవిడ్‌-19 టీకాను వేయించుకోవడం అంతా మీ ఇష్టమేనని పేర్కొంది. ప్రజలు స్వచ్ఛంధంగా తమ ఇష్టపూర్వకంగా ఎవరికి వారే నిర్ణయం తీసుకోవచ్చునని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇతర దేశాల్లో కరోనా టీకా సామర్థ్యంతో పోలిస్తే.. భారత్‌లో కరోనా టీకా కూడా అదే స్థాయిలో ప్రభావంతమైనదిగా పేర్కొంది. ఇప్పటివరకూ కొవిడ్‌-19 సోకనివారు కూడా వ్యాక్సిన్‌ డోసులను పూర్తిగా తీసుకోవడం మంచిదని సూచించింది. కరోనా వ్యాక్సిన్లపై ప్రజల్లోని భయాందోళలను నివృతి చేసే దిశగా కేంద్ర ఆరోగ్య శాఖ పలు అంశాలను వెల్లడించింది.

వ్యాక్సిన్ వేయించుకోవడం అనేది అందరికి తప్పనిసరి కాదు.. సంపూర్ణ రక్షణ పొందాలంటే అందరూ టీకా డోసులు తీసుకోవడం మంచిది. త్వరలో వ్యాక్సిన్‌ పంపిణీని ప్రారంభిస్తాం. ప్రస్తుతం దేశంలో 6 కంపెనీల టీకాలు వివిధ ట్రయల్ దశల్లో ఉన్నాయి. ఐసీఎంఆర్‌-భారత్‌ బయోటెక్‌ వ్యాక్సిన్‌, జైడస్‌ కాడిలా టీకా, జెన్నోవా వ్యాక్సిన్‌, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ-సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా టీకా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌-గమలేయా స్పుత్నిక్‌ వీ టీకా, బయోలాజికల్‌ ఈ-ఎంఐటీ వ్యాక్సిన్‌ వరుసగా ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమైనవిగా రుజువైతేనే అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొంది.

సాధారణంగా ఎలాంటి వ్యాక్సిన్‌ తీసుకున్నా కొద్దిపాటి జ్వరం, నొప్పి వంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తాయి. టీకాకు సంబంధించిన సైడ్‌ ఎఫెక్ట్స్‌ను ఎదుర్కొనడానికి తగిన ఏర్పాట్లు, వైద్య సాయాన్ని ఏర్పాటు చేయాలని అన్ని రాష్ర్టాలను ఆదేశించామని తెలిపింది. అలాగే క్యాన్సర్‌, మధుమేహం, బీపీ తదితర అనారోగ్య సమస్యలకు మందులు వాడుతున్నవాళ్లు కూడా టీకాను తీసుకోవచ్చునని తెలిపింది. 28 రోజుల వ్యవధిలో ప్రతి ఒక్కరూ రెండు డోసులు తప్పనిసరిగా వేయించుకోవాల్సిందిగా సూచించింది.

టీకా వేయించుకునేవారంతా వెబ్‌సైట్‌/యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకోవాలి. రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఒక SMS వస్తుంది. టీకా వేసే ఆరోగ్య కేంద్రం, టీకా వేసే సమయం వంటి వివరాలు అందిస్తారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో ఫొటోతో కూడిన ఏదైనా గుర్తింపు కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. డోసుల లభ్యతను బట్టి పంపిణీ జరుగనుంది. వైరస్‌ నుంచి ఎక్కువ ప్రమాదం ఉన్న వారికే ముందుగా టీకా ప్రాధాన్యత ఉంటుంది. కొవిడ్‌-19 రోగులకు చికిత్సను అందించే వైద్యులు, నర్సులు, ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్‌ అందించనున్నారు.