Diabetes : చక్కెర వ్యాధిగ్రస్తులు… చిన్నచిన్న గాయాలను అశ్రద్ధ చేస్తున్నారా?…

ముఖ్యంగా కాలి వేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి. వేళ్ల మధ్య పొడిగా ఉండేందుకు పౌడర్‌ను గానీ మొక్కజొన్న పిండిని గానీ చల్లుకోవాలి.

Diabetes : చక్కెర వ్యాధిగ్రస్తులు… చిన్నచిన్న గాయాలను అశ్రద్ధ చేస్తున్నారా?…

Sugar

Diabetes : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఇబ్బందుల పాలుచేస్తున్న వ్యాధుల్లో మధుమేహం లేదా చక్కెర వ్యాధి ఒకటి. ఇన్సులిన్ హార్మోన్ స్ధాయి తగ్గడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఒకసారి వచ్చిందంటే దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. దీని వల్ల ఆరోగ్యపరంగా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

మధుమేహులు చిన్నచిన్న గాయాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే అవే చివరకు ప్రాణాల మీదకు తెచ్చిపెట్టే అవకాశం ఉంటుంది. గాయాలు, పుండ్లు త్వరగా మానకపోవటం.. ఇన్‌ఫెక్షన్‌ తలెత్తి తీవ్రం కావటం వల్ల అక్కడి కణజాలం, ఎముక దెబ్బతినే ప్రమాదమూ ఉంది. దీంతో కాలి వేళ్లను, పాదాలను తొలగించాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది.

మధుమేహం నియంత్రణలో లేకపోతే నాడులు దెబ్బతినటం, రోగనిరోధకశక్తి మందగించటం, రక్తనాళాలు సన్నబడటం వంటి పలు సమస్యలు తలెత్తుతాయి. నాడులు దెబ్బతింటే గాయం, పుండు తీవ్రమయ్యేంతవరకూ నొప్పి ఉండదు. రోగనిరోధకశక్తి తగ్గితే చిన్న గాయమైనా త్వరగా ఇన్‌ఫెక్షన్‌ లోనవుతుంది. రక్తనాళాలు సన్నబడితే తగినంత రక్తం సరఫరా కాక పుండు నయంకాదు. అందువల్ల గాయాలు, పుండ్ల విషయంలో మధుమేహులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.

మధుమేహుల్లో కాలికి ఏదైనా తగిలితే తెలియకపోవటంతో పాటు చూపు సమస్యలూ ఉంటాయి. దీంతో గాయం తీవ్రం అయ్యేంతవరకు వాటిని గుర్తించలేరు. అందువల్ల అసలు కాళ్లకు దెబ్బలు తగలకుండా, పుండ్లు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రోజూ పాదాలను క్షుణ్నంగా పరిశీలించాలి. బొబ్బలు, ఆనెలు, ఎరుపు, వాపు, గీసుకుపోవటం వంటివేమైనా ఉన్నాయేమో గమనించాలి. పాదాలను అందుకోలేకపోతే అద్దం సాయంతో పాదం కింది భాగాన్ని చూసుకోవాలి. రోజుకు ఒకసారి గోరు వెచ్చటి నీటితో పాదాలను కడుక్కోవాలి. పాదాలను పూర్తిగా ఎండనివ్వాలి.

ముఖ్యంగా కాలి వేళ్ల మధ్య తడి లేకుండా చూసుకోవాలి. వేళ్ల మధ్య పొడిగా ఉండేందుకు పౌడర్‌ను గానీ మొక్కజొన్న పిండిని గానీ చల్లుకోవాలి. చర్మం మృదువుగా ఉండేందుకు పాదం పైన, కింద మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. కాలి గోళ్లు తీసుకునేటప్పుడు చర్మం తెగకుండా జాగ్రత్త తీసుకోవాలి. మధుమేహుల కోసమే ప్రత్యేకంగా తయారుచేసిన చెప్పులు, షూ, సాక్స్‌ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. వీలుంటే అలాంటివి వేసుకుని తిరగటం ఉత్తమం.

పొగ తాగటం రక్తంలో ఆక్సిజన్‌ మోతాదును తగ్గిస్తుంది. ఇది పుండ్లు మానటం ఆలస్యం కావటానికి, తీవ్రం కావటానికి దారితీస్తుంది. కాబట్టి పొగ అలవాటుంటే వెంటనే మానెయ్యాలి. ఇంట్లోనూ చెప్పులు వేసుకోవాలి. దీనివల్ల పాదాలకు గాయాలు కాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ పుండ్లు పడితే పుండుపై నీటిని పోస్తూ శుభ్రంగా కడగాలి. సబ్బు, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, అయోడిన్‌ వంటివి వాడొద్దు. పుండుపై యాంటీబయోటిక్‌ మలాం రాసి, శుభ్రమైన బ్యాండేజీని చుట్టాలి. బ్యాండేజీని రోజూ మారుస్తుండాలి. పుండు చుట్టుపక్కల భాగాన్ని సబ్బుతో శుభ్రం చేయాలి. అనునిత్యం పుండును గమనిస్తుండాలి. ఎరుపు, వాపు వంటి ఇన్‌ఫెక్షన్‌ లక్షణాలేవైనా కనబడితే వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.