Sleeping Pills : నిద్రమాత్రలు అతిగా వాడుతున్నారా…గుండె,కిడ్నీలు డేంజర్లో పడ్డట్టే

నిద్ర మాత్రలు వాడటం వల్ల తాత్కాలికంగా నిద్ర సమస్యలు దూరం అవుతాయి. కానీ, అదే సమయంలో మెదడు పని తీరు కూడా క్రమ క్రమంగా నెమ్మదిస్తుంది.

10TV Telugu News

Sleeping Pills : ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మందిలో సుఖవంతమైన నిద్రకరువైంది. దీంతో రాత్రిళ్ళు సరిగా నిద్రపట్టని పరిస్ధితి. ఇందుకోసం నిద్ర లేమికి పరిష్కారంగా నిద్ర మాత్రలను చాలా మంది వాడాల్సి వస్తుంది. నిద్రమాత్ర వేసుకోకపోతే ఆ రాత్రికి ఇక నిద్ర లేనట్లే అన్న పరిస్థితిలో చాలామంది తమకు తెలియకుండా నిద్రమాత్రలకు బానిసలుగా మారుతున్నారు. నేటి టెక్నాలజీ కాలంలో రెగ్యులర్‌గా నిద్ర మాత్రలు వేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరిగి పోతోంది. ఆహారపు అలవాట్లు, అధిక ఒత్తిడి, ఆందోళన, ముబైల్స్‌ను ఓవర్‌గా వినియోగించడం, పోషకాల కొరత ఇలా రకరకాల కారణాల వల్ల నిద్ర లేమికి గురవుతుంటారు.

నిద్రమాత్రలు మాత్రలు మెదడు, కేంద్ర నాడీవ్యవస్థల పనితీరుపై ప్రభావం చూపి, ఆందోళనను తగ్గించి నిద్రపట్టేలా చేస్తాయి. అయితే వీటి వాడకం ఎక్కువైతే ఎదురయ్యే సైడ్‌ఎఫెక్ట్స్‌ చాలా శక్తిమంతమైనవి. పగలు కూడా నిద్ర ముంచుకొస్తున్నట్లు, మెదడు పని చేయడానికి సహకరించక బద్దకంగా అనిపించడం, తల తిరగడం, అయోమయం, చూపు అస్పష్టంగా మారడం, తలంతా పట్టేసినట్లు ఉండడం, మానసిక ఆందోళన అంతలోనే ఉద్వేగం వెంటనే ఆనందం ఇలా క్షణక్షణానికీ మారడం , జ్ఞాపకశక్తి లోపించడం వంటి సమస్యలను కొనితెచ్చుకున్న వాళ్లమవుతాం.

మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు స్లీపింగ్‌ పిల్స్‌ వాడకాన్ని అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు వైద్యులు సూచిస్తారు. అదికూడా తప్పని పరిస్థితుల్లో తగుమాత్రం డోస్‌ను సూచిస్తారు. వాటి వాడకం ఆ సమస్య నుంచి బయటపడే వరకు మాత్రమే పరిమితం చేస్తారు. ప్రిస్క్రిప్షన్‌లో నిద్రమాత్రలను రాసినట్లు తెలియనివ్వరు. తెలిస్తే ఎవరికి వారు తరచూ వాడి ఇతర సమస్యలు కొనితెచ్చుకుంటారనే ఉద్దేశంతోనే ఈ జాగ్రత్త పడతారు.

ప్రతి రోజు నిద్ర మాత్రలు వేసుకుంటే తల నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. కంటి చూపు మందగించడం, మైకంగా అనిపించడం, అలసట, అధిక దాహం, శరీరం బలహీనంగా మారి పోవడం వంటివి కూడా జరుగుతుంటాయి. నిద్ర లేమికి నిద్ర మాత్రలు ఎప్పుడూ పరిష్కారం కాదు. పైగా నిద్ర మాత్రలను ప్రతి రోజు వాడటం వల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

నిద్ర మాత్రలు వాడటం వల్ల తాత్కాలికంగా నిద్ర సమస్యలు దూరం అవుతాయి. కానీ, అదే సమయంలో మెదడు పని తీరు కూడా క్రమ క్రమంగా నెమ్మదిస్తుంది. దాంతో తక్కువ వయసులోనే మతిమరుపు, ఆలోచనా శక్తి నశించడం వంటి సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.అలాగే రెగ్యులర్‌గా నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బ తింటుంది. దాంతో మలబద్ధకం, గ్యాస్‌, కడుపు నొప్పి, ఎసిడిటీ, ఆకలి తగ్గి పోవడం వంటివి తరచూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.నిద్ర మాత్రలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల గుండె మరియు మూత్ర పిండాల ఆరోగ్యం విపరీతంగా పాడవుతుంది. దాంతో గుండె సంబంధిత జబ్బులు మరియు కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి.

అంతేకాదు, రోజూ నిద్ర మాత్రలు తీసుకుంటే క్యాన్సర్‌, శ్వాసకోశ సంబంధిత సమస్యలు, చర్మ అలర్జీలు, తరచూ ఒత్తిడికి గురి కావడం ఇలా ఎన్నో సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నిద్ర మాత్రలను వేసుకోవడం తగ్గించుకోవటం ఆరోగ్యపరంగా శ్రేయస్కరం..