Fiber : ఆహారంలో పీచు పదార్థం.. ఆరోగ్యానికి మేలే…

తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా వుంటే, విరోచనం 2-3 సార్లు అవటానికి అవకాశం ఉన్నది. విరోచనం మెత్తగా ఎక్కువ మోతాదులో అయ్యే అవకాశం కలుగుతుంది.

10TV Telugu News

Fiber : మనిషి తీసుకొనే ఆహారంలో పీచు పదార్థం ఎంతో మేలు చేస్తుంది. అది మనిషిని ఆరోగ్యంగా ఉంచటమేకాక అనారోగ్యాలను చెంతకు చేరకుండా కాపాడేందుకు దోహదపడుతుంది. జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా తినే ఆహారం విషయంలో సరైన అవగాహన లేకపోవటంతో ప్రస్తుతం తీసుకుంటున్నా ఆహారాలు మానవదేహాన్ని రోగ గ్రస్తతం చేస్తున్నాయి. ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని వదిలి కృత్రిమ ఆహారం తీసుకునేందుకు మక్కువ చూపటంతో కొత్తకొత్త రోగాలు పుట్టుకువస్తున్నాయి. ప్రస్తుతం తింటున్న ఆహారంలో పీచుపదార్ధ లోపం స్పష్టంగా కనిపిస్తుంది.

నల్లటి చెరకు రసాన్ని తెల్లటి పంచదారగా తీసుకోవడం, తౌడు తీసేసిన బియ్యం తినటం, పీచు పదార్థం లేకుండా చేస్తున్న గోధుమ బ్రెడ్ లు తినడం వంటి వాటి వల్ల అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది. తీసుకొన్న ఆహారం ప్రేగులలో జీర్ణం అయిన తర్వాత, శరీరానికి శక్తిని ఇచ్చే పదార్థాలన్నీ రక్తంలో కలసిపోతాయి. జీర్ణం కాని ఈ పీచు పదార్థం ప్రేగులలో నీటిని పీల్చుకొని ఉబ్బి, ప్రేగులలో అవసరం లేని పదార్థాలను మలాశయానికి చేర్చి అక్కడ నుండి మలం రూపంలో బయటకు విసర్జించబడుతుంది.

తౌడు తియ్యని బియ్యం, పై పొర తీయని గోధుమలు, తౌడు, బార్లీ, మొక్కజొన్న,బంగాళాదుంపలు, క్యారెట్, బీట్ రూట్, చిలకడదుంపలు మామిడి, బొప్పాయి, జామ, పనస, అన్ని రకాల ఆకు కూరలు, క్యాబేజి, ములగ, బీర, బెండ, పొట్ల, కొబ్బరి, వేరుశనగ, శనగ, బఠానీలు, సోయాబీన్స్ మొదలైన ఆహారపదార్ధాల్లో పీచుపదార్ధం అధికంగా ఉంటుంది. పీచు పదార్ధంలేని ఆహారాలైన మాంసము, చేప, పీత, రొయ్య, కోడిగుడ్డు, పాలు, వెన్న, క్రొవ్వు పదార్థాలు, పంచదార వంటి వాటి వల్ల కొవ్వు శరీరంలో పేరుకుంటుంది. మాంసహారం తినేవారికి విరోచనం బద్ధకం ఏర్పడుతుంది.

పీచుపదార్ధం వల్లే కలిగే ప్రయోజనాలు..

తీసుకునే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువగా వుంటే, విరోచనం 2-3 సార్లు అవటానికి అవకాశం ఉన్నది. విరోచనం మెత్తగా ఎక్కువ మోతాదులో అయ్యే అవకాశం కలుగుతుంది. రోజుకు 5-6 సార్లు కొద్ది కొద్దిగా విరోచనం అయ్యేవారు, విరోచనం అయినప్పుడల్లా నొప్పి, ఎక్కువ బంకతో వెళ్ళేవారు తరచూ విరోచనం అవ్వక కడుపు నొప్పితో బాధపడేవారు, ఎక్కువగా పీచు పదార్థం వున్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల పూర్తిగా ఈ ఇబ్బందులన్నింటిని నివారించుకోవచ్చును.

ప్రమాదకరమైన క్యాన్సర్ క్రిములు ప్రేగులలో నిల్వయున్న మలం నుండి పుడతాయని పరిశోధనల్లో తేలింది. పెద్ద ప్రేగులో వుండే యాసిడ్ యొక్క శక్తిని బట్టి ఆ క్రిముల పుట్టుక ఆధారపడి వుంటుంది. ప్రేగులలో వుండే బాక్టీరియా పీచు పదార్థాన్ని ముక్కలుగా విడగొట్టి మలాన్ని ఎక్కువ ఆమ్లత్వంగా వుండేటట్లు చేస్తుంది. మలం ఆమ్లత్వం వల్ల క్యాన్సర్ కు సంబంధించిన క్రిములు పెద్ద ప్రేగులలో తయారు కాకుండా పీచు పదార్థం కాపాడుతుంది.

పెద్ద ప్రేగులలో మలం ఎక్కువ సమయం నిల్వ ఉండకుండా త్వరగా కదిలి మలం బయటకు పోయేటట్లు పీచు పదార్థం చేస్తున్నందువల్ల ప్రాణానికి అపకారం చేసే క్రిములు మలంలో తయారయ్యే అవకాశం ఉండదు. పీచు పదార్థం పెద్ద ప్రేగులలో మంచి బాక్టీరియాని పెంపొందిస్తుంది. పెద్ద ప్రేగులలో వుండే అమోనియాను తగ్గించి, అక్కడ కణాలు రోగనిరోధక శక్తిని కల్గి ఉండేలా చేస్తుంది.ఆహారంలో వున్న క్రొవ్వు పదార్థాలను, కొలెస్ట్రాల్ ను, ప్రేగుల నుండి రక్తంలోనికి వెళ్ళకుండా, పీచు పదార్థం కొంత తగ్గిస్తుంది.

పీచు పదార్థం ఎక్కువగా తీసుకొనుట వల్ల శరీరానికి దీర్ఘ కాలిక రోగాలు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటాయి. పీచు పదార్థం ఎక్కువ ఉన్న పళ్ళు, కూరలు, గింజ ధాన్యాలు ఎక్కువగా తిన్నా శరీరం బరువు పెరగదు. పీచు పదార్థం క్రొవ్వుని బాగా కరిగిస్తుంది. మూలశంక, ప్రేగులకు క్యాన్సర్, గుండెకు సంబంధించిన వ్యాధులు, రక్తనాళాలు మూసుకుపోవటం, రక్తం గడ్డ కట్టుకపోవడం, మలబద్ధకం ద్వారా వచ్చే అన్ని రోగాలు నిరోధించడానికి పీచు పదార్థం ఔషధంగా పనిచేస్తుంది.