Balanced Diet : పరీక్షల వేళ సమతుల ఆహారంతో ఆరోగ్యం!

పరీక్షల సమయంలో విద్యార్ధులు ఎక్కువగా ఆహారం తీసుకోక పోవటం వల్ల శారీరకంగా, మానసికంగా నీరసంగా మారతారు. ఒక్కోసందర్భంలో సమయం దొరదని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేందుకు ప్రయత్నిస్తారు.

Balanced Diet : పరీక్షల వేళ సమతుల ఆహారంతో ఆరోగ్యం!

Balanced Diet During Exams

Balanced Diet : విద్యార్ధులకు పరీక్షల సమయమిది. వారి దృష్టి మొత్తం చదువుపైనే కేంద్రీకృతమై ఉంటుంది. ఈ సమయంలో వారు తినే ఆహారం విషయంలో ఏమాత్రం జాగ్రత్తలు చూపించకపోయినా ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పరీక్షల సమయంలో అనారోగ్యం పాలయ్యే సందర్భాలు ఉంటాయి. చదువుల్లో పడి సరైన ఆహారాన్ని తీసుకోకపోతే సమస్యలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరైన వ్యాయామం, సంతులిత ఆహారం తీసుకుంటే పరీక్షలను సులభంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదయం తీసుకునే అల్పాహారంలో ప్రొటీన్ , కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవాలి. ఒక గ్లాసు పాలు, సీజనల్ గా లభించే పండ్లు తీసుకోవాలి. చాలా మంది విద్యార్ధులు పరీక్షలకు ప్రిపేరయ్యే మూడ్ లో ఉండి బ్రేక్ ఫాస్ట్ ను మానేస్తుంటారు. సమయం లేదని తినకుండానే ఉండి పోతారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదు. ఇడ్లీ, దోస, ఉమ్మా వంటి వాటిని ఏదైనా తీసుకోవచ్చు. బయటి వాటి కంటే ఇంట్లో తయారు చేసినది తీసుకోవటం మంచిది.

చాలా మంది విద్యార్ధులు మధ్యలో స్నాక్స్ రూపంలో చాక్లెట్లు, పిజ్జాలు, బర్గర్లు తింటుంటారు. వీటికి బదులుగా ఖర్జూరం, బాదం, వాల్ నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ తీసుకోవటం మంచిది. వెజిటేబుల్ కట్స్ ఇస్తే ఇంకా మంచిది. క్యారెట్ ముక్కలు, కీరదోస వంటి వాటిని స్నాక్స్ గా తీసుకోవాలి. పెరుగు, మజ్జిగ వంటి వాటిని తాగేందుకు చాలా మంది పిల్లలు ఇష్టత చూపరు అలాంటి వారికి పెరుగుతో తయారు చేసిన సలాడ్ లను అందించాలి. వేసవి కాలంలో సీజన్ వారీగా అందుబాటులో ఉండే పండ్లను పెరుగుతో కలపి ఇవ్వాలి.

ఇంట్లో తయారు చేసిన వాటిని మాత్రమే పిల్లలకు ఇవ్వటం మంచిది. పరీక్షల సమయంలో పిల్లలకు కాపీలు, టీలు వంటివాటిని ఇవ్వటం మంచిది కాదు. ఒక వేళ వాటని తీసుకున్నా ఒకటి రెండు పర్యాయాలకే పరిమితం అయ్యేలా చూడాలి. కాఫీ, టీలకు బదులుగా గ్రీన్ టీ తీసుకోవచ్చు. తీసుకునే ఆమారం విషయంలో ఒకే సారి అధిక మొత్తంలో తీసుకోవటం మంచిది కాదు. కొద్ది కొద్ది మొత్తాల్లో ఎక్కువ సార్లు ఆహారం తీసుకోవటం మంచిది.

పరీక్షల సమయంలో విద్యార్ధులు ఎక్కువగా ఆహారం తీసుకోక పోవటం వల్ల శారీరకంగా, మానసికంగా నీరసంగా మారతారు. ఒక్కోసందర్భంలో సమయం దొరదని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినేందుకు ప్రయత్నిస్తారు. ఒకేసారి తినటం వల్ల నిద్ర వచ్చినట్లు , మంపుగా ఉంటుంది. ఆహారాన్ని కొద్ది మొత్తాల్లో ఎక్కువ సార్లుగా తీసుకోవటం వల్ల విద్యార్ధులకు తగిన శక్తి అందుతుంది. పరీక్షలకు సమాయత్తం అయ్యే వారు ఒత్తిడితో ఉంటారు. అలాంటి వారు తగినంత నిద్రపోవాలి. పడుకునే ముందు వేడిపాలు తాగాలి.

పరీక్షలు రాసేవారికి వ్యాధులు చుట్టుముట్టకుండా రోగ నిరోధకశక్తి కలిగి ఉండటం అవసరం. ఈ శక్తి కోసం విటమిన్లు, మినరల్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉండే ఆరంజ్, జామకాయ, బత్తాయి వంటి పండ్లను తీసుకోవాలి. పరీక్షల సమయంలో నిలవ ఉంచిన ఆహారపదార్ధాలను తీసుకోవద్దు. జంక్ ఫుడ్, కొవ్వులు అధికంగా ఉండే ఆహారల జోలికి వెళ్ళొద్దు. రిలాక్స్ కోసం , ఒత్తిడిని పోగొట్టుకునేందుకు కొద్ది నిమిషాలు వ్యాయామం చేయాలి. వాకింగ్ చేయటం వల్ల కొంత రిలాక్స్ గా ఉంటుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.