Micro Greens : అధిక మొత్తంలో పోషకాలందించే మైక్రో గ్రీన్స్

మైక్రో గ్రీన్స్ కు మంచి ప్రజాదరణ లభిస్తుంది. ఇప్పటికే సెలబ్రెటీలు మైక్రో గ్రీన్స్ ను ఆహారంగా తీసుకుంటుండటంతో అదే ట్రెండ్ ను ప్రస్తుతం సాధారణ ప్రజానికం ఫాలో అవుతున్నారు.

Micro Greens : అధిక మొత్తంలో పోషకాలందించే మైక్రో గ్రీన్స్

Micro Greens

Micro Greens : కరోనా వేళ ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ రోజు రోజుకు పెరుగుతుంది. తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేసుకుంటున్నారు. కూరగాయలు, ఆకు కూరలతో కూడిన ఆహారాన్ని తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిణామాలు ప్రజల ఆరోగ్యం మెరుగుపర్చుకునేందుకు దోహదపడతాయి నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పురుగుమందులు వాడి పండించే ఆహారాన్ని తినేందుకు ఏమాత్రం ఇష్టం చూపించటంలేదు. సేంద్రీయ విధానంలో సాగైన ఆకు కూరలు, కూరగాయలను తమ ఆహారంలో చేర్చుకోవాలన్న ఆలోచనతో ఉన్న వారి సంఖ్య పెరుగుతుంది. ఇంటి ఆవరణల్లో , పెరట్లో పండించిన వాటిని తినేందుకు మక్కువ చూపుతున్నారు.

ఇంట్లో తక్కువ స్ధలంలో పెంచుకునే మైక్రోగ్రీన్స్ ను చాలా మంది ఇష్టపడుతున్నారు. మైక్రో గ్రీన్స్ లో ఎన్నో పోషకాలు దాగి ఉండటమే ఇందుకు కారణం. మైక్రో గ్రీన్స్ లో లభించే పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుండటంతో వాటిని ఇంట్లోనే తామే స్వయంగా పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చిన్న పరిమాణంలో ఉండే మైక్రో గ్రీన్స్ పెద్ద సైజు ఆకు కూరల కన్నా ఎక్కవ పోషక విలువలు కలిగి ఉన్నట్లు పరిశోధనల్లో తేలటంతో వీటిని సూపర్ ఫుడ్ గా భావిస్తున్నారు.

ఈక్రమంలో మైక్రో గ్రీన్స్ కు మంచి ప్రజాదరణ లభిస్తుంది. ఇప్పటికే సెలబ్రెటీలు మైక్రో గ్రీన్స్ ను ఆహారంగా తీసుకుంటుండటంతో అదే ట్రెండ్ ను ప్రస్తుతం సాధారణ ప్రజానికం ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆ ట్రెండ్ క్షేత్ర స్ధాయికి చేరటంతో ప్రతి ఇల్లు మైక్రో గ్రీన్స్ పెంపకానికి నిలయాలుగా మారుతున్నాయి. కేవలం వేసిన ఏడు రోజుల్లోనే మైక్రోగ్రీన్స్ ఆహారంగా తీసుకునేందుకు అందుబాటులోకి వస్తుండటంతో తక్కువ ఖర్చుతో చిన్నచిన్న ట్రేలలో వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు.

మైక్రో గ్రీన్స్ పెంపకానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. చిన్నపాటి ట్రేలలో మట్టిని నింపుకుని మార్కెట్లో లభించే వివిధ రకాల మైక్రో గ్రీన్స్ విత్తనాలను అందులో చల్లుకోవాలి. కొద్దిపాటి నీటి జల్లులను అందించటం ద్వారా అవి మొలకొత్తుతాయి. ఏడురోజుల్లోనే చిన్నసైజులో ఉండగానే వాటిని ఆహారంగా తీసుకోవచ్చు. బ్రోకొలి, కాలిఫ్లవర్, క్యారెట్, పాలకూర, తోటకూర, ముల్లంగి, బీట్ రూట్, కొత్తిమీర, వాము, వెల్లుల్లి, కీరదోస, బీన్స్, బఠానీ, మెంతి వంటి మైక్రో గ్రీన్స్ ను తినేందుకు ఆసక్తి చూపుతున్నారు.

మైక్రో గ్రీన్స్ ద్వారా మన శరీరానికి అనేక పోషకాలు అందుతాయి. వాటిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్స్ , పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు దరి చేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.