మీ ముఖారవిందాన్ని ఫెయిర్‌గా మార్చేస్తామన్న ఫెయిర్ అండ్ లవ్లీ…పేరు మార్చుకొంటోంది

  • Published By: venkaiahnaidu ,Published On : June 25, 2020 / 10:33 AM IST
మీ ముఖారవిందాన్ని ఫెయిర్‌గా మార్చేస్తామన్న ఫెయిర్ అండ్ లవ్లీ…పేరు మార్చుకొంటోంది

ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ కీలక నిర్ణయం తీసుకుంది. జాతి వివక్ష, సౌందర్య ప్రామాణికతపై ప్రపంచవ్యాప్త చర్చ జరుగుతన్న సమయంలో  యూనిలీవర్ ఇండియన్ యూనిట్ ..చాలా కాలంగా విమర్శలను ఎదుర్కొంటున్న  సంస్థ ప్రధాన బ్రాండ్ ఫెయిర్ అండ్ లవ్లీ నుండి ‘ఫెయిర్’ అనే పదాన్ని తొలగించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు దీన్ని రీబ్రాండ్ చేయనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ముదురు రంగు చర్మం ఉన్నవారికి వ్యతిరేకంగా ప్రతికూల మూసలను(stereotypes) ప్రోత్సహిస్తున్నందుకు ఫెయిర్ అండ్ లవ్లీ చాలాకాలంగా విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 

కాగా, భారతదేశంలో విక్రయించే రెండు ఫెయిర్‌నెస్ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ మల్టీనేషనల్ జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించిన వారం తరువాత హెచ్‌యూఎల్ ఈ నిర్ణయం ప్రకటించడం విశేషం. అయితే విశ్లేషకులు  అంచనా వేసినట్టుగానే సౌందర్య ఉత్పత్తులను నిలిపివేయడం కాకుండా..కేవలం పేరు మార్చేందుకు నిర్ణయించడం గమనార్హం. 

 ఫెయిర్ అండ్ లవ్లీకి చేసిన మార్పులతో పాటు, మిగిలిన చర్మ సంరక్షణ పోర్ట్‌ఫోలియో కూడా ‘పాజిటివ్ బ్యూటీ, సమగ్ర దృష్టిని’ ప్రతిబింబిస్తుందని హిందుస్తాన్ యూనిలీవర్ కంపెనీ తెలిపింది. రెగ్యులేటరీ ఆమోదం తరువాత రాబోయే కొద్ది నెలల్లో పేరును ప్రకటిస్తామని కంపెనీ భావిస్తోంది. ఫెయిర్ అండ్ లవ్లీ. వార్షిక అమ్మకాల విలువ 560 మిలియన్ల డాలర్లు. భారతీయ స్కిన్  వైట్నింగ్ మార్కెట్ లో 50-70శాతం ఫెయిర్ అండ్ లవ్లీ సొంతం.

ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకేజీమీద ‘ఫెయిర్/ఫెయిర్‌నెస్’, ‘వైట్  వైట్నింగ్’ ‘లైట్ / మెరుపు’ వంటి పదాలను కూడా తొలగించినట్లు హెచ్‌యూఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా వెల్లడించారు. ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ పై ఉండే రెండు ముఖాలతో పాటు ఉండే మరో (నల్ల)ముఖాన్ని తొలగించామన్నారు. రెగ్యులేటరీ ఆమోదం అనంతరం కొత్త పేరుతో మరికొద్ది నెలల్లో వినియోగదారుల ముందుకు రానున్నామని వెల్లడించారు. గత దశాబ్దంలో మహిళల సాధికారత సందేశంతో ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటనలు తీసుకొచ్చామని పేర్కొన్నారు. దీనికి ప్రజలనుంచి మంచి ఆదరణ లభించిందన్నారు. ఇకపై దేశవ్యాప్తంగా వివిధ స్కిన్ టోన్ల మహిళలను గౌరవిస్తూ, వారి ప్రాతినిధ్యంతో విభిన్నంగా ఇవి ఉండబోతున్నాయన్నారు.