ఇదో హ్యాపీ ఫ్రిడ్జ్ : ఫ్రీగా నిరుపేదల ఆకలి తీరుస్తోంది

  • Published By: sreehari ,Published On : November 8, 2019 / 01:23 PM IST
ఇదో హ్యాపీ ఫ్రిడ్జ్ : ఫ్రీగా నిరుపేదల ఆకలి తీరుస్తోంది

దేశంలో ఆహార వ్యర్థం ప్రబలంగా మారుతోంది. చాలా ప్రాంతాల్లో ఆహార పదార్థాలను వృథా చేస్తున్నారు. పెళ్లి విందుల్లో, ఇతర పార్టీల్లో మిగిలిపోయిన ఆహార పదార్థాలు వీధుల్లో పారవేస్తున్నారు. రోజురోజుకీ ఆహార వ్యర్థాలు తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయి. ఆహార వ్యర్థాలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అవసరానికి మించి ఆహార పదార్థాలను తయారు చేసి వృథా చేస్తున్నారు. ఇంటి మందుకు ఎవరైనా వచ్చి ఆకలి అంటే లేదు పొమ్మని గెంటేస్తారు. మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను చెత్తకుప్పల్లో పారవేస్తున్నారు. ఒకవైపు ఆకలి కోసం నిరుపేదలు అలమటిస్తుంటే.. మరోవైపు ఆహారం ఎక్కువై వీధుల్లో వ్యర్థాలుగా మార్చేస్తున్నారు. తినే ఆహారాన్ని పారవేయకుండా వాటిని ఆకలితో బాధపడే వారికి పెట్టడం వల్ల వారి కడుపు నిండుతుంది. 

మీరు పారవేసే ఆహారాన్ని నిరుపేద కుటుంబం ఒకపూట భోజనం చేయొచ్చు. ఇకపై ఆహార వ్యర్థాలను నియంత్రించాలనే ఉద్దేశంతో ముంబైలోని అంథేరి నివాసులు ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. అంథేరి, వెరసోవా సంక్షేమ సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నిరుపేదల ఆకలి తీర్చేందుకు ఓ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. ఇందులో మిగిలిన ఆహార పదార్థాలను ఉంచుతారు. దీనికోసం ఒక వ్యక్తిని కూడా నియమించారు. ఈ ఫుడ్ ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చే నిరుపేదలకు అడిగిన ఆహారాన్ని అందించి వారి ఆకలి తీరుస్తున్నారు. ఈ ఫ్రిడ్జ్ దగ్గరకు ప్రతిరోజు మధ్యాహ్నాం 1 గంట నుంచి 2.30గంటల మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. రాత్రి 7 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిరుపేదలు ఆహారాన్ని తినేందుకు వస్తుంటారు. 

ఇలాంటి కమ్యూనిటీ ఫ్రిడ్జ్ లను ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్టు నివాసి ఒకరు తెలిపారు. ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ లను నవీన్ కుమార్ మండల్ అనే వ్యక్తి పర్యవేక్షిస్తున్నాడు. ఆహార వ్యర్థాలను నియంత్రించడం.. ఎక్కువ ఆహారాన్ని సేకరించి అవసరమైన వారి ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు మండల్ తెలిపారు. ఇళ్లు లేకుండా రోడ్ల పక్కనే నివసించే నిరుపేదలు, నిరుద్యోగుల కోసం ఈ ఫుడ్ ఫ్రిడ్జ్ ద్వారా ఆహారాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. అఫ్జల్ అన్సారీ అనే వ్యక్తి ఈ కమ్యూనిటీ ఫ్రిడ్జ్ నుంచి రోజు ఆహారాన్ని తీసుకుంటున్నాడు. ప్రతి రోజు మధ్యాహ్నాం 12గంటలకు వస్తున్నామని, మధ్యాహ్నాం 1గంట నుంచి 2 గంటల మధ్య ఆహారాన్ని అందిస్తున్నారిని చెప్పాడు. ఉద్యోగం లేకపోయినా రెండు పూటల కడుపు నింపుకుంటున్నామని సంతోషం వ్యక్తంచేశాడు. 

కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ల్లోని ఆహారాన్ని దగ్గరలోని నివాసాలు, వెరసోవా వెల్ ఫేర్ సొసైటీ సభ్యుల నుంచి ఆహార పదార్థాలను సేకరించి నిరుపేదలకు సరఫరా చేస్తున్నారు. భువనేశ్వర్ లో  కూడా మరో కమ్యూనిటీ ఫ్రిడ్జ్ ఒకటి ఉంది. ఇక్కడ కూడా అవసరమైన వారికి ఆహారాన్ని అందిస్తుంటారు. ఫీడింగ్ ఇండియా అనే ఎన్జీవో సంస్థ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫుడ్ స్టోర్ చేసేందుకు వీలుగా కమ్యూనిటీ రిఫ్రిజేటర్లను ఏర్పాటు చేసింది. ఈ ఫ్రిడ్జ్ లను హ్యాపీ ఫ్రిడ్జ్ అని పిలుస్తారు. ఆకలితో ఉన్నవారి కోసం నిల్వ చేసే స్టోర్ లాంటిదని అర్థం. 

ఫీడింగ్ ఇండియా నగర నేత శ్యామ సింగ్ తమ ప్రాంతంలోని నివాసితులకు.. కనీసం రెండు చపాతీలు, ఒక బౌల్ అన్నం, పప్పు విరాళంగా ఇవ్వాలని కోరారు. వారు అందించే ఆహారంతో ఒక వ్యక్తి ఆకలి తీరుతుందని ఆయన విన్నవించారు. మరోవైపు ఫ్రిడ్జ్ ల్లో స్టోర్ చేసే ఆహారంలోని నాణ్యతను పరీశీలించేందుకు వాలంటీర్లను కూడా నియమించారు. ఇటీవల ప్రపంచ ఆకలి సూచిక (GHI)లో 117 దేశాల్లో ఇండియా 102వ స్థానంలో నిలిచింది. ఇలాంటి కమ్యూనిటీ ఫ్రిడ్జ్ లతో నిరుపేదల ఆకలి తీరిస్తే.. దేశంలో ఆకలి సమస్యను పూర్తిగా నిర్మూలించవచ్చు.