Honey : తేనె అమృతమే కాదు..ఔషదం కూడా!..

తేనె కలిపిన గ్లాసుడు నీళ్ళు సుఖనిద్రకు మంచిది. రాత్రిపూట తేనెనీళ్ళు శరీరాన్ని శాంతింపజేసి శక్తిని ఇస్తాయి.

Honey : తేనె అమృతమే కాదు..ఔషదం కూడా!..

Honey

Honey : మనిషికి ఆహారం అనేది శక్తిని ఇవ్వడానికి మాత్రమే కాకుండా ఇంకా అనేక జీవక్రియలకు అవసరం. ఎందుకంటే చక్కెర కన్నా రెండు రెట్లు ఎక్కువ తీపిగా ఉండే తేనె క్రిమి సంహారక గుణాన్ని కలిగి ఉంటుంది. బ్యాక్టీరియాని చంపేస్తుంది. కిలో తేనెలో నీటి శాతాన్ని బట్టి సుమారుగా 3150 – 3350 కేలరీలు ఉంటాయి. శరీర ఎదుగుదలకు అవసరమైన విభిన్న పదార్థాలు 80కి పైగా తేనెలో వున్నాయి. ఇన్ వెర్టేజ్, డయాస్టేజ్, కెటలేజ్, హెరాక్సిడేజ్, లైపేజ్ వంటి ఎన్ జైములు అధికంగా ఉండే ఆహార పదార్ధాల్లో తేనె ప్రధమస్ధానంలో ఉంటుంది.

తేనెలో కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఇనుము, క్లోరిన్, ఫాస్ఫరస్, సల్ఫర్, అయొడిన్, లవణాలు కూడా ఉంటాయి. కొన్ని రకాల తేనెలలో చివరికి రేడియం కూడా వుంటుంది. అలాగే తేనెలో మాంగనీసు, అల్యూమినియం, బోరాన్, క్రోమియం, రాగి, లిథియం, నికెల్, సీసం, తగరం, టైటానియం, జింక్, ఆస్మియం లవణాలు కూడా ఉంటాయని నిరూపితమైంది.

తేనెలోని ఆమ్లశాతం ఫార్మిక్ ఆమ్లం మీద ఆధారపడి ఉంటుందని, తెట్టెలోని తేనెను మూసేసి భద్రపరిచే ముందు తేనెటీగలు ఫార్మిక్ ఆమ్లాన్ని తేనెలోనికి పంపుతాయని కనుగొన్నారు. తేనెలో ప్రధానంగా ఆర్గానిక్ ఆమ్లములు, మాలిక్, సిట్రిక్, టార్టారిక్, ఆక్జాలిక్ ఆమ్లాలు ఉంటాయి. తేనెటీగలు తయారుచేసిన తేనెలో బి1, బి2, బి3, బి4, బి5, బి6, ఇ, సి, కె, కెరోటిన్ విటమిన్లు ఉంటాయి. అలాగే ఎసిటైల్ కోలిన్, హార్మోన్లు, ఏంటీబయాటిక్ లు, వృక్ష బాక్టీరియమ్ నాశకాలు వుంటాయి.

తేనెలో ఏఏ విటమిన్లు ఉన్నాయి అనేది, దానిలోని పుప్పొడుల మిశ్రమం మీద ఆధారపడి ఉంటుంది. తేనెలో వుండే డెక్ స్ట్రిన్ అనే పదార్థం కారణంగా తేనె త్వరగా జీర్ణమయి ప్రేగుల నుండి రక్తంలోకి త్వరగా  కలుస్తుంది. తేనెకు బాక్టీరియమ్ నాశక ధర్మాలే కాకుండా శిలీంద్ర నాశక ధర్మాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పిల్లల ఆహారంలో చక్కెర బదులు తేనె ఇస్తే పిల్లలు ఆరోగ్యవంతంగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. నోటిలోని ఖాళీల్లో మిగిలిపోయిన చక్కెర, బాక్టీరియాల ప్రభావం వలన విభజన చెంది ఆమ్లాలుగా ఏర్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. నోటిలో ఖాళీలను రోగక్రిములు లేకుండా తేనె శుభ్రపరుస్తుంది.

అనేక వ్యాధులను, గాయాలను నయం చేయడంలో తేనె బాగా పనిచేస్తుంది. దేహంలో ఆక్సీకరణ, క్షయకరణ ప్రక్రియలు జరగడంలోనూ, కణాలు అభివృద్ధి చెందుటలోనూ, విభజన చెందుటలోను గ్లూటథియోన్ ఎంతో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులను నయం చేయడానికి, శ్లేష్మాన్ని హరింపజేసి దగ్గును తగ్గించేందుకు ఉపకరిస్తుంది. జలుబు బాగా చేసినపుడు గ్లాసు గోరువెచ్చని నీరులో ఒక నిమ్మకాయ రసం పిండి, అందులో ఒక పెద్ద గరిటెడు తేనె వేసి కలిపి తీసుకుంటే జలుబు త్వరగా తగ్గుతుంది. ఈ పానీయాన్ని ప్రతీ రెండు గంటలకు ఒకసారి చొప్పున తీసుకోవటం మంచిది. తేనెలో హైయ్యర్ ఆల్కహాల్ మరియు ఇతర ఆయిల్స్ కలిసి ఉండుట వలన శ్వాసక్రియ సాఫీగా జరగడానికి అవకాశం కలుగుతున్నది.

గుండెకు సంబంధించిన వ్యాధుల మూలంగా బలహీనపడిన గుండె కండరాలకి, తేనె ఎంతో అమూల్యమైన సహాయాన్ని అందిస్తుంది. గుండె కండరం మీద తేనె చక్కటి ప్రభావాన్ని చూపడానికి కారణం, తేనెలో తేలిగ్గా జీర్ణమయ్యే గ్లూకోజ్ ఉండటమే. తేనె సిరలని వ్యాకోచించేలా చేసి, గుండె నాళాల్లో రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. తేనెను రోజుకు సుమారు 80 గ్రాముల చొప్పున, 1-2 నెలలపాటు తీసుకుంటే గుండెజబ్బులతో బాధపడే వారికి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. గుండె రక్త నాళాల చురుకుదనం పెరుగుతుంది.

డయాబెటిస్ రోగులు కూడా తేనెని తీసుకోవచ్చు. తేనెలో గ్లూకోజు కంటే కూడా ఫ్రక్టోజు షుగరు ఎక్కువ ఉంటుంది. గ్లూకోజును రక్తం లో నుండి కణాలకు చేర్చడానికి ఇన్సులిన్ అవసరమవుతుంది. అదే ఫ్రక్టోజ్ అయితే ఇన్సులిన్ సహాయము లేకుండా కణాలకు చేర్చబడుతుంది. డయాబెటిస్ వచ్చిన వారికి ఇన్సులిన్ తయారు చేసే పాంక్రియాస్ గ్రంధి సరిగా పనిచేయదు. కాబట్టి ఇన్సులిన్ సహాయం లేకుండా మనం తిన్న ఆహారం కణాలకు అందే విధంగా ఉంటే, మనకు షుగరు తగ్గుతుంది. తేనెను తీసుకున్న వెంటనే అందులో వున్న గ్లూకోజు ప్రేగుల నుండి త్వరగా రక్తంలోకి వెళ్ళిపొతుంది. తాత్కాలికంగా షుగరు శాతం పెరిగినా, ఆ గ్లూకోజ్ ను కణాలు వినియోగించుకున్న వెంటనే షుగరు మామూలు స్థితికి వచ్చేస్తుంది.

కాలేయపు కణజాలాలకు గ్లూకోజు పోషక పదార్థాలని సరఫరా చేయటమే కాకుండా, గ్లైకోజెన్ నిల్వలని కూడా పెంచి, కొత్త కణ జాలాలు ఏర్పడే ప్రక్రియ బాగా జరిగేలా చేస్తుంది. కాలేయం ఫిల్టర్ లాగా బాక్టీరియ వంటి విష పదార్థాలన్నింటిని వడబోస్తుంది. కాలేయం మీద తేనె మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. నరాలకు సంబంధించిన కొన్ని వ్యాధులకి గ్లూకోజ్ ఎక్కువగా ఉన్న ద్రావణాలని ఉపయోగిస్తే మంచి ఫలితాలు చాలా కనిపిస్తాయి అని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అలాంటి ద్రావణాల్లో తేనె ఒకటిగా చెప్పవచ్చు.

తేనె కలిపిన గ్లాసుడు నీళ్ళు సుఖనిద్రకు మంచిది. రాత్రిపూట తేనెనీళ్ళు శరీరాన్ని శాంతింపజేసి శక్తిని ఇస్తాయి. నీళ్లలో నానబెట్టిన తవుడికి తేనెని కలిపి తింటే అది నరాలకి పుష్టి నివ్వడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కళ్ళవాపుకి తేనె అద్భుతమైన మందుగా చెప్పవచ్చు. కళ్ళ క్రింద రెప్పలలో గోరువెచ్చటి తేనెబొట్టుని వేస్తే 3-4 రోజులలో కళ్ళ వాపులు తగ్గుతాయి.కాలిన గాయముల మీద వెంటనే తేనె రాస్తే అక్కడ నీటి బొబ్బలు రాకుండా కాపాడి, త్వరగా గాయాలను మాన్పి, మచ్చలు పడకుండ చేయడానికి తేనె అద్భుతంగా పనిచేస్తుంది. బరువు తగ్గించుటకు తేనె ఉపయోగించటం మంచిది.

తేనె వాడటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది. తద్వారా మనకు రక్తహీనత సమస్యను పోగొట్టుకోవచ్చు. వాంతులు, వికారాలు, వచ్చి మనిషికి ఆహారం లోపలికి పోక శక్తి చాలక నీరసంగా ఉన్నప్పుడు కొద్దిగా తేనెను అరచేతిలో వేసుకొని మెల్లగా చప్పరిస్తే వెంటనే 10 నిమిషములలో శక్తి వస్తుంది. తేనెలో వున్న మాలిక్ యాసిడ్ కీళ్ళనొప్పులు తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

తేనె యొక్క రంగు, రుచి, చిక్కదనం చెట్ల యొక్క పూతను బట్టి ఆధారపడి ఉంటుంది. స్వచ్ఛమైన తేనె అయితే ఎన్ని వందల సంవత్సరాలున్నా చెడిపోదు. తేనెను ఎండలో పెట్టాలిగానీ, ఎప్పుడూ వేడి చేయకూడదు. తేనెకు పదార్థాలను నిలువ ఉంచే గుణం ఉంది. అందువలన తేనెను నిలువ చేయడానికి ఏ మందులూ వాడనవసరం లేదు. తేనెను వీలుంటే గాజు సీసాలో నిలువ ఉంచుకోవడం మంచిది. కుదరనప్పుడు స్టీలు వస్తువులలో దాచుకోవచ్చు. దాచుకున్న తేనె అప్పుడప్పుడూ ఎండలో పెడుతూ ఉండాలి. తేనెను ఫ్రిజ్ లో నిల్వచేయటం శ్రేయస్కరం కాదు.