ఇడ్లీ విశేషాలు : ఇడ్లీ ఇండియా వంటకం కాదట

  • Published By: veegamteam ,Published On : March 31, 2019 / 05:15 AM IST
ఇడ్లీ విశేషాలు : ఇడ్లీ ఇండియా వంటకం కాదట

టిఫిన్ మెనూలో ప్రథమస్థానం ‘ఇడ్లీ’దే. అల్పాహారంలో మొదటి  ఓటు ‘ఇడ్లీ’కే. బ్రేక్ ఫాస్ట్ ఏం చేసావని అడిగితే ఎక్కువమంది చెప్పే మాట ‘ఇడ్లీ. ఇలా టిఫిన్ అంటే అంటే ఠక్కున గుర్తుకొచ్చేది కూడా ఇడ్లీనే. దోశ, బజ్జీ, ఉప్మా, పూరీ, పెసరట్టు ఇలా ఎన్ని ఉన్నా.. ఇడ్లీకి ఉండే ప్రత్యేకతే వేరు. ఇండియన్స్ కు ఇంత మక్కువ పెంచిన ఇడ్లీ ఇండియాది కాదట. వింటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఎందుకంటే ఇండియన్స్ అల్పాహారంలో అంతగా పెనవేసుకుపోయింది ‘ఇడ్లీ’.
 

దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లినా ఈజీగా లభించే ఇడ్లీ.. మన ఇండియాలో పుట్టలేదని చరిత్రకారులు చెబుతున్నారు. ఇడ్లీ అంటే సాధారణంగా దక్షిణాది వంటకం అనుకుంటాం. కానీ..కేటీ ఆచార్య అనే ఫుడ్ హిస్టరియన్స్ మాత్రం ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందని చెబుతున్నారు. 

ఒకప్పుడు ఇండోనేషియాను పాలించిన హిందూ రాజులు ఉడికించే వంటకాలను కనుగొన్నారట. ఇందులో భాగంగానే ఇడ్లీలు తయారు చేయడం మొదలుపెట్టారట. ఈ క్రమంలో 800 – 1200 సంవత్సరంలో ఇడ్లీ ఇండియాలో అడుగుపెట్టిందట. ఇండియాలో  తొలిసారిగా కర్నాటకలో ఇడ్లీలను తయారు చేశారని, వాటిని ‘ఇడ్డలిగే’ అని పిలిచేవారనీ..వీటిని (ఇడ్లీలను)సంస్కృతంలో ‘ఇడ్డరికా’ అని పిలిచేవారని చెబుతున్నారు. 

కైరోలోని అల్-అజహర్ యూనివర్శిటీ లైబ్రరీలో ఉన్న వివరాల ప్రకారం..దక్షిణ భూభాగంలో నివసించిన అరబ్ వ్యాపారులు ఇడ్లీని ఇండియాకు పరిచయం చేశారని..దక్షిణాది ప్రజలను వివాహం చేసుకుని సెటిల్ అవ్వటంతో ఇడ్లీ దక్షిణాది వంటకంగా పేరొందినట్లుగా ఉంది. ముస్లిం వంటకాలైన హలామ్‌లో కొంచెం ప్రత్యేకంగా కనిపించేందుకు రైస్ బాల్స్ ను క్రమేణా వాటిని గుండ్రంగా సన్నగా ప్రస్తుతం ఉన్న ఇడ్లీల రూపంలోకి మలిచి కొబ్బరి చెట్నీతో తినడాన్ని అలవాటు చేసుకున్నారట. అలా అలా 8వ శతాబ్దం నుంచి ఆ రైస్ బాల్స్.. ఇడ్లీ పేరుతో ప్రచారంలోకి వచ్చి దేశమంతా వ్యాపించాయని చరిత్రకారులు చెబుతున్నారు. 
 

ఏది ఏమైనా ఇడ్లీ ఎక్కడ ఎలా పుట్టినా..ఇడ్లీ ఇండియాదేనని బలంగా నమ్ముతున్నారు భారతీయులు. అంతేకాదు ఇడ్లీకి ఇండియన్ ఫుడ్‌గా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. మార్చి 30  ‘ప్రపంచ ఇడ్లీ డే’ సందర్భంగా.. ఇడ్లీలు లేదా చట్నీల్లో ఎన్ని వెరైటీలు ఉన్నాయో అన్ని రకాలు ట్రై చేయండి. ఆరోగ్యాన్ని పెంచుకోండి. ఆరోగ్య భారతాన్ని నిర్మించండి.