Bone Strength : వయస్సు 55 దాటితే ఎముకల బలంపై దృష్టిపెట్టాల్సిందే!..

పొగాకు, ఆల్కహాల్‌ దురలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటివి ఎముకల్లో సాంద్రత తగ్గేలా చేస్తాయి.

Bone Strength : వయస్సు 55 దాటితే ఎముకల బలంపై దృష్టిపెట్టాల్సిందే!..

Bones

Bone Strength : ఎముకలో ఉండాల్సిన ఖనిజాలు, పదార్థాల సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఎముక ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. ఎముకలో క్యాల్షియమ్, ఇతర మినరల్స్‌ వంటివి తక్కువగా ఉంటే అది పెళుసుగా మారిపోతుంది. పెళుసుగా ఉన్న ఎముకలు త్వరగా విరిగిపోతాయి. ఎముక గట్టిగా ఉండాలంటే అందులో ఉండాల్సిన పదార్థాలూ, ఖనిజ లవణాలన్నీ సమతూకంగా ఉండాలి. అప్పుడే ఎముక బలంగా ఉంటుంది. ఎముక సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు జబ్బులు రాకుండా ఉంటాయి.

మనం తీసుకునే ఆహారం నుంచి, సూర్యరశ్మి నుంచి అవి అనేక పోషకాలను గ్రహిస్తాయి. ఆహారం నుంచి క్యాల్షియమ్, సూర్యరశ్మి నుంచి విటమిన్‌ డి గ్రహిస్తాయి. మనం చేసే శారీరక శ్రమ కూడా తోడైతే అవి మరింత బలంగానూ, ఆరోగ్యకరంగానూ తయారవుతాయి. మహిళలు 55 ఏళ్లు దాటిన వారైతే, పురుషులైతే 65 ఏళ్లు దాటినవారైతే ఒకసారి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంది.

మనిషికి 30 ఏళ్లు వచ్చే నాటికి అతడి ఎముకల్లోని సాంద్రత గరిష్టంగా ఉంటుంది. అలా గరిష్టంగా ఉన్న 30 ఏళ్ల వయసు తర్వాత నుంచి… క్రమంగా ఎముకలోని పదార్థాన్ని కోల్పోతూ ఉంటారు. దీన్నే ప్రోగ్రెసివ్‌ బోన్‌ లాస్‌ అని వ్యవహరిస్తారు. ఒకవేళ ఎముకలు త్వరత్వరగా తమ సాంద్రత కోల్పోతే అవి చాలా త్వరగా పెళుసుబారి త్వరగా ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. మహిళల విషయానికి వస్తే రుతుస్రావం ఆగిపోయిన తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది.

పొగాకు, ఆల్కహాల్‌ దురలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటివి ఎముకల్లో సాంద్రత తగ్గేలా చేస్తాయి. జీవనశైలి, కాఫీ, ఆల్కహాల్‌ వంటి అలవాట్లు… ఇవన్నీ ఎముక సాంద్రత త్వరగా తగ్గడానికి దోహదం చేసే అంశాలే. అంతేకాకుండా హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, కుషింగ్‌ సిండ్రోమ్, అనొరెక్సియా నర్వోజా, మాల్‌ అబ్షార్‌ప్షన్‌ సిండ్రోమ్‌, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, ఫిట్స్‌ వస్తున్నప్పుడు తీసుకునే మందులైన యాంటీ కన్వల్సెంట్స్, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ వంటి దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గిపోయి వివిధ రకాల ఎముక రుగ్మతలు తలెత్తుతాయి.

ఎముకల బలం కోసం క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే ఆహారాన్ని అంటే పాలు, పెరుగు, బ్రకోలీ వంటి తాజా కూరలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. అలాగే ఆరుబయట ఎండకు ఎక్స్‌పోజ్‌ అవుతూ ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల శరీరంలో విటమిన్‌ డి ఎక్కువగా తయారవుతుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లోని క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి ఇంకేలా చేస్తుంది విటమిన్‌ ‘డి’. అందుకే కేవలం క్యాల్షియమ్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నంత మాత్రాన కాకుండా… విటమిన్‌ డి వల్ల కూడా ఎముకలకు బలం చేకూరుతుంది.