First DNA Vaccine : భారత్‌లో ప్రపంచపు మొట్టమొదటి DNA వ్యాక్సిన్.. ZyCoV-D షాట్ ఎలా పనిచేస్తుందంటే?

కరోనాను నిరోధించేందుకు స్వదేశీ టీకాను తయారుచేసింది జైడస్ క్యాడిలా సంస్థ. కరోనా DNA వ్యాక్సిన్‌ను తయారు చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు.

First DNA Vaccine : భారత్‌లో ప్రపంచపు మొట్టమొదటి DNA వ్యాక్సిన్.. ZyCoV-D షాట్ ఎలా పనిచేస్తుందంటే?

India To Have World's First Dna Vaccine', Here's How The Zycov D Shot Works

India To Have World’s First DNA Vaccine : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి పట్టిపీడుస్తోంది. కరోనాను నిరోధించేందుకు స్వదేశీ టీకాను తయారుచేసింది జైడస్ క్యాడిలా సంస్థ. కరోనా DNA వ్యాక్సిన్‌ను తయారు చేసిన ప్రపంచంలోనే తొలి దేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పార్లమెంటుకు తెలిపారు. అహ్మదాబాద్‌కు చెందిన జైడస్ కాడిలా ZyCoV-D వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇటీవలే ఈ DNA టీకా అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసింది. ఈ నెల ప్రారంభంలో, జైడస్ కాడిలా, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) నుంచి ప్రపంచంలోని మొట్టమొదటి Plasmid DNA వ్యాక్సిన్ కోసం అత్యవసర వినియోగానికి అనుమతి కోరింది. ఫేజ్-3 కరోనా ట్రయల్స్‌లో టీకాలు వేసిన వాలంటీర్లలో ఎవరిలోనూ వైరస్ తీవ్రత లేదు. మరణాలు లేవు.

ZyCoV-D మొదటి DNA ఆధారిత వ్యాక్సిన్ కరోనాపై పనిచేస్తుందని తేలిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా 50 సైట్లలో మూడవ దశ ట్రయల్స్ జరిగాయి. 28వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు. దేశంలో కరోనా రెండవ వేవ్ ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడే ట్రయల్స్ నిర్వహించారు. కొత్త మ్యుటేషన్ స్ట్రెయిన్లపై టీకా సమర్థతంగా పనిచేయగలదని తేలింది. డెల్టా వేరియంట్ పై కూడా పనిచేస్తుంది. ఈ టీకాను 12-18 ఏళ్ల వయస్సు గల పిల్లలపై కూడా పరీక్షించారు. వారిలోనూ ఈ టీకా సురక్షితమేనని కనుగొన్నారు. ఔషధ రెగ్యులేటర్ సంస్థ అదనపు డేటాను కోరగా.. ఆగస్టులో ZyCoV-D విడుదలకు అనుమతి వచ్చే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ టీకా అందబాటులోకి వస్తే.. భారత్ బయోటెక్ కోవాక్సిన్ తరువాత దేశీయంగా తయారైన రెండవ టీకా అవుతుంది. ప్రతి ఏటా 10-12 కోట్ల మోతాదుల వ్యాక్సిన్‌ను తయారు చేయాలని కంపెనీ యోచిస్తోంది.

ZYCOV-D ఏ రకం వ్యాక్సిన్? :
జైడస్ కాడిలా టీకా.. జన్యు లేదా న్యూక్లియిక్ యాసిడ్ వ్యాక్సిన్లుగా పిలిచే వర్గానికి చెందినది. ఈ వ్యాక్సిన్లు వైరస్ జన్యు డేటా భాగాన్ని శరీరంలోకి చొప్పించడం ద్వారా పనిచేస్తాయి. వైరస్ ముఖ్య భాగాన్ని ఉత్పత్తి చేయడానికి కణాలను ప్రేరేపిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ గుర్తించి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. జన్యు వ్యాక్సిన్లు RNAపై ఆధారపడి ఉంటాయి. ఫైజర్, మోడెర్నా mRNA షాట్లు అమెరికాలో వినియోగిస్తున్నారు. జన్యుపరంగా ఇంజనీరింగ్ బ్లూప్రింట్ చిన్న DNA అణువులలో (ప్లాస్మిడ్లు) చొప్పించడం ద్వారా DNA ఆధారిత వ్యాక్సిన్లు పనిచేస్తాయి. మానవ శరీరం లోపల ఒకసారి కణాలు DNA ప్లాస్మిడ్‌లను తీసుకుంటాయి. వ్యాధి నుండి రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. మనుషుల్లో వినియోగం కోసం ఏదైనా జన్యు వ్యాక్సిన్లను తయారు చేయడం ఇదే మొదటిసారి.

మోతాదు, స్టోరేజీ, డెలివరీ ఎలానంటే? :
ప్రపంచంలో దాదాపు అన్ని కరోనా వ్యాక్సిన్లు రెండు డోసులు.. జాన్సన్ జాన్సన్ మాత్రం సింగిల్ డోస్ షాట్.. అదే.. ZYCOV-D మాత్రం మూడు డోసులు నాలుగు వారాల వ్యవధిలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇమ్యునోజెనిసిటీ ఫలితాలు ప్రస్తుత మూడు మోతాదు నియమావళికి సమానమని తేలింది. ZyCoV-D టీకాలో మరో విషయం ఏమిటంటే.. సూది రహితం.. అంటే ఇంట్రాడెర్మల్ టీకా.. సూదుల భయం కారణంగా చాలామంది ఈ టీకాలను వేయించుకోవడానికి ఇష్టపడరు. సూది కారణంగా తలెత్తే అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఈ రకం టీకాలో ఉండదనే చెప్పాలి. వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయవచ్చు. కానీ, కనీసం మూడు నెలలు 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద స్టోర్ చేయొచ్చు. అల్ట్రా-కోల్డ్ స్టోరేజ్ అవసరమయ్యే mRNA వ్యాక్సిన్ల మాదిరిగా కాకుండా సులభంగా ఎక్కడికైనా రవాణా చేయొచ్చు.

జన్యు టీకాలు సురక్షితమేనా? :
ఈ టీకాల్లో వైరస్ ప్రత్యక్ష భాగాలను వినియోగించారు. అసలు వ్యాప్తికి ఎలాంటి ప్రమాదం ఉండదు. ఉత్పత్తి విషయానికొస్తే.. వైరస్ జన్యువు క్రమం చేసిన తర్వాత, చాలా తేలికగా ఉత్పత్తి అవుతుంది. భవిష్యత్తులో ఏవైనా మ్యుటేషన్లను లక్ష్యంగా చేసుకునేందుకు అనుకూలంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. జైడస్ కాడిలాతో పాటు, ప్రపంచవ్యాప్తంగా ఇతర టీకా తయారీదారులు జపాన్ బయోటెక్నాలజీ సంస్థ AnGesతో సహా DNA వ్యాక్సిన్లపై దృష్టిసారించారు.