2021కు ముందు ప్రజలకు వ్యాక్సిన్ వేయడం సాధ్యమేనా? WHO ఎందుకు రాదంటోంది?

  • Published By: sreehari ,Published On : July 23, 2020 / 10:00 PM IST
2021కు ముందు ప్రజలకు వ్యాక్సిన్ వేయడం సాధ్యమేనా? WHO ఎందుకు రాదంటోంది?

ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఫలితాలిస్తున్న జోష్‌తో వేగంగా ముందుకెళ్తున్నాయి. కానీ సంస్థలు, కంపెనీలు భావించినట్టుగా ఈ ఏడాదిలోనే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందా..? మాటలు చెప్పినంత ఈజీగా మెడిసిన్ వస్తుందా..? ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఆ ఛాన్సే లేదంటోంది. అసలు 2021 కంటే ముందు కరోనాకి మందు వచ్చే అవకాశం లేదని కుండబద్దలు కొడుతుంది. ఇంతకీ WHO అంత గట్టిగా వ్యాక్సిన్ రాదని ఎలా చెప్పగల్గుతోంది..?

ప్రయోగాల్లో పురోగతి సాధిస్తున్న పరిశోధకులు :
కరోనా వైరస్‌ నియంత్రించేందుకు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయ‌డంలో ప‌రిశోధ‌కులు మంచి పురోగ‌తి సాధిస్తున్నారన్న ఊహాగానాలు మొదలవుతున్నాయి. అయితే 2021 కంటే ముందు పూర్తిస్థాయిలో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచంలోని పలు దేశాల్లో వివిధ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని, కొన్ని మూడో దశ ప్రయోగాలకు చేరుకున్నాయని గుర్తు చేసింది.

ఏ ఒక్కటీ విఫలం కాకపోవడం శుభపరిణామం అంటోంది డబ్ల్యూహెచ్‌ఓ. అయితే 2021 కంటే ముందు ప్రజలకు టీకా వేయడం సాధ్యపడకపోవచ్చని అభిప్రాయపడింది. వ్యాక్సిన్‌ పంపిణీలో ఎలాంటి భేదాలకు ఆస్కారం ఉండబోదని స్పష్టం చేసింది.

యువకులపైనే ఎక్కువగా ప్రయోగాలు :
ఆమెరికాలోని ఆక్స్‌ఫర్డ్‌, రష్యాలోని సెషనోవ్‌ యూనివర్సిటీ టీకా ఆగస్టులోనే వస్తుందని ప్రచారం జరుగుతోంది. చైనాలో మూడో దశ ట్రయల్స్‌ ప్రారంభమైనట్టు కథనాలు వస్తున్నాయి. భారత్‌ బయోటెక్ కూడా‌ కో వ్యాక్సిన్ తొలి దశ హ్యూమన్ ట్రయల్స్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది వ్యాక్సిన్ వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం కొట్టిపారేస్తోంది.

అంత త్వరగా వ్యాక్సిన్‌ వచ్చే ఛాన్స్ లేదంటోంది. ఇప్పటిదాకా యువకులపైనే ఎక్కువగా ప్రయోగాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలు, వృద్దులపై ఎలాంటి ప్రయోగాలను నిర్వహించినట్టు దాఖలాలు లేవు. కేవలం ఒక వర్గానికి మాత్రమే చేయడం వల్ల ఉపయోగం లేదంటోంది. అలాగే అన్ని వయసుల వారిపై ప్రయోగాలు జరిగితేనే ఒక నిర్దారణకు రాగలమన్నది డబ్ల్యూహెచ్‌ఓ వాదన.

రియాక్షన్స్‌, సైడ్‌ ఎఫెక్ట్స్ ఉంటాయా అన్నదే ఆసక్తికరం :
చాలా కంపెనీలు తమ వ్యాక్సిన్ల ప్రయోగాలను ఆరోగ్య వంతులు, లక్షణాలు లేనివారిపైనే జరిపాయి. మొదటి దశలో ఎంపిక చేసిన వారిపైనే ట్రయల్స్ జరిపాయి. రెండో దశలో వేర్వేరు ప్రాంతాల్లో దశలవారీగా డోసులు ఇచ్చి ప్రయోగాలు చేశాయి. వారిని అబ్జర్వేషన్‌లో పెట్టి పర్యవేక్షించింది.

ఇక్కడి వరకు చాలా వ్యాక్సిన్లు సక్సెస్ అయ్యాయి. కానీ థర్డ్ దశలో వేలాదిమందిపై ట్రయల్స్ జరపాల్సి ఉంటుంది. అలాగే వేర్వేరు వయసులున్న వారిని సెలెక్ట్ చేసి డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. వారి నుంచి ఎలాంటి రియాక్షన్స్‌, సైడ్ ఎఫెక్ట్స్‌ వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ మధ్య వయస్కులపై ప్రయోగాలు విజయవంతమైనా.. వృద్దులపై అవి పనిచేస్తాయా అన్నది అనుమానమే. కొన్ని సంస్థలు ఇప్పటికే 60ఏళ్లకు పైబడిన వారిపై కూడా ప్రయోగాలు చేయాలని డిసైడ్‌ అయ్యాయి. ఆ దిశగా అడుగులు కూడా వేస్తున్నాయి.

10 రోజులుగా రోజుకి 500లకు పైగా మరణాలు :
భారత్‌లో కరోనా కేసుల ఉధృతి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే 12లక్షల మందికి పైగా వైరస్ బారినపడ్డారు. కరోనా సోకి 29వేల మంది మృత్యువాతపడ్డారు. గత 10 రోజులుగా 500కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. మరణాల రేటు దేశంలో 2.5 శాతంగా ఉంది. ప్రపంచ దేశాలతో పోల్చితే మరణాల రేటు తక్కువగానే ఉన్నా… క్రమంగా రోజువారీ మరణాలు పెరుగుతున్నాయి.

రోజుకి 40వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌తో పాటు తెలుగురాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో వైరస్‌ చైన్‌ తెంచేలా కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టినా పెద్దగా ఫలితాలు ఇవ్వడం లేదు.

మరణాల్లో ఇండియాది 8వ స్థానం :
ప్రస్తుతం దేశంలో ప్రతి పది లక్షల మందిలో 20 మంది కరోనాతో చనిపోతున్నారు. ప్రపంచంలో ఈ సంఖ్య 78గా ఉంది. అంటే ప్రపంచ దేశాలతో పోల్చితే… కరోనా మరణాల్లో ఇండియా కాస్త మెరుగ్గానే ఉందని చెప్పాలి. ఇండియాలో… జీరో నుంచి 40వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవ్వడానికి 94 రోజులు పట్టింది.

ప్రస్తుతం ఆసియాలోని మొత్తం కరోనా కేసుల్లో ఇండియా 33 శాతం కలిగి ఉంది. ప్రపంచంలో అత్యధిక కేసులున్న దేశాల్లో ఇండియా థర్డ్‌ ప్లేస్‌లో ఉంది. రోజువారీ నమోదవుతున్న కేసుల్లో అమెరికా తర్వాత రెండోస్థానంలో ఉంది. మొత్తం మరణాల్లో ఇండియా 8వ స్థానంలో ఉండగా… రోజువారీ మరణాల్లో భారత్ రెండో స్థానానికి చేరినట్టు వరల్డ్ మీటర్స్ లెక్కలు చెబుతున్నాయి.

పరిస్థితి ఇప్పటికీ కంట్రోల్‌లోనే ఉన్నా.. ముందు ముందు వైరస్‌ ఏ స్థాయిలో విజృంభిస్తుందన్నదే అంతుపట్టకుండా మారింది. వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా ఫలితం లేకుండాపోతుంది. దీంతో జనం దృష్టి వ్యాక్సిన్‌పైనే పడింది.

వైరస్‌కి విరుగుడుగా మందు ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాది మాత్రం మెడిసిన్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అప్పటిదాకా కరోనాతో సహజీవనం చేయాల్సిందేనంటున్నారు నిపుణులు.