నేలపై ఇంద్రధనస్సు : కశ్మీర్ లో ‘తులిప్’ తుళ్లింతలు

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 04:10 AM IST
నేలపై ఇంద్రధనస్సు : కశ్మీర్ లో ‘తులిప్’ తుళ్లింతలు

అందమైన పూలను చూస్తే..కల్లోలంగా ఉండే మనసు కూడా ఆహ్లదంగా మారిపోతుంది. రంగురంగుల్లో విరిసిన వేలాది తులిప్‌ సోయగాలను ఒకే చోట చూస్తే..అదికూడా లక్షల సంఖ్యల్లో  చూసేందుకు రెండు కళ్లూ చాలవన్నట్లు మనస్సుతోనే వాటిని ఆస్వాదిస్తాం. 

ఎన్నెన్నో వర్ణాల పూలు..ముసి ముసి నవ్వులతో సందర్శకులను స్వాగతిస్తున్నాయి. తులిప్ ల సోయగాలు ఇంద్రధనుస్సు నేలపై విరిసినట్లు, పుడమితల్లిపై రంగుల తివాచీగా మారిన భావన కలుగుతుంది. ప్రకృతి అందాలకు నిలయమైన కశ్మీరం తులిప్‌ అందాలతో తుళ్లిపడుతోంది. 

జమ్మూ కశ్మీర్‌లోని దాల్‌ సరస్సు సమీపంలో ఆసియాలోనే అతిపెద్ద తులిప్‌ పూల గార్డెన్‌ సందర్శకులతో కోలాహలంగా మారింది. తులిప్‌ గార్డెన్‌లోని లక్షలాది పుష్పాలు ఒకేసారి వికసించడంతో ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా తయారైంది. దీంతో ఒక్కసారిగా స్థానికులు, పర్యాటకులతో గార్డెన్ కిటకిటలాడుతోంది. కశ్మీర్‌ లోయలో పర్యటక సీజన్‌ ప్రారంభానికి గుర్తుగా ఈ గార్డెన్‌లోకి ప్రతిఏటా పర్యాటకులను అనుమతిస్తుంటారు. ఒక్కో తులిప్‌ పుష్పం గరిష్ఠంగా మూడు, నాలుగు వారాల పాటు వికసించి ఉంటుంది. దీంతో రంగు రంగుల పూలమొక్కలు.. చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించేందుకు టూరిస్టులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.